అమెరికాలో హైదరాబాద్ ​స్టూడెంట్ కిడ్నాప్​

  •                              1200 డాలర్లు డిమాండ్​ చేసిన డ్రగ్స్ మాఫియా
  •     ఇవ్వకుంటే కిడ్నీ అమ్మేస్తామంటూ బెదిరింపులు
  •     విదేశాంగ మంత్రిత్వ శాఖకు తండ్రి సలీం లేఖ

సికింద్రాబాద్, వెలుగు :  ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ హైదరాబాద్ ​స్టూడెంట్​ను అక్కడి డ్రగ్స్​ మాఫియా కిడ్నాప్​ చేసింది. విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్​లోని నాచారం ఎర్రకుంట అంబేద్కర్ నగర్​లో నివాసముండే మహ్మద్​ సలీం కుమారుడు  మహ్మద్​ అబ్దుల్​ అర్ఫత్​(25)  నగరంలో డిగ్రీపూర్తి చేశాడు. అతడికి  అమెరికాలోని క్లీవ్​లాండ్​ యూనివర్సిటీలో  ఐటీ మాస్టర్​ కోర్సులో అడ్మిషన్​ లభించింది. నిరుడు మే లో అర్ఫత్​ అమెరికా వెళ్లి.. ఓహియోలో ఉంటూ చదువుకుంటున్నాడు. ప్రతిరోజూ తన తండ్రితో ఫోన్​లో  మాట్లాడే అర్ఫత్​ ఈ నెల 7 నుంచి అందుబాటులోకి రాలేదు. ఎన్నిసార్లు ఫోన్​చేసినా స్విచ్ఛాఫ్​ రావడంతో ఆందోళనకు గురైన సలీం.. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​కు లేఖ రాశారు. 

విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా వాషింగ్టన్​లోని ఇండియన్​ ఎంబసీకి, చికాగోలోని ఇండియన్ కాన్సులేట్​కు సమాచారం ఇచ్చి తమ కుమారుడి ఆచూకీ రాబట్టాలని కోరారు. ఇదిలా ఉండగానే .. అమెరికా నుంచి  గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్​ చేసి తాము డ్రగ్స్​ ముఠాకు చెందిన వారమని, మీ కొడుకును కిడ్నాప్​ చేశాం..  వెంటనే 1200 డాలర్లు పంపాలని.. అప్పుడే నీ కొడుకును వదిలేస్తామని సలీంను బెదిరించారు. అయితే, ఈ డబ్బులు ఎక్కడకు పంపాలి?  ఎలా పంపాలనే సమాచారం మాత్రం చెప్పలేదని సలీం తెలిపారు.  

డబ్బులు పంపకపోతే అర్ఫత్​ కిడ్నీలు అమ్మేస్తామని బెదిరించినట్టు చెప్పారు. ఈ విషయాన్ని అమెరికాలో ఉన్న తమ బంధువులకు తెలియజేశామని, వారు క్లీవ్​లాండ్​ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.  కేసు నమోదు చేసిన పోలీసులు  దర్యాప్తు మొదలు పెట్టినట్టు సలీం​ తెలిపారు. కాగా, ఈ నెల 18న అర్ఫత్​ కిడ్నాప్​పై  అమెరికాలోని తమ కుటుంబ సభ్యులు చికాగోలోని ఇండియన్​ కాన్సులేట్​కు  ఫిర్యాదుచేసినట్టు చెప్పారు.