ట్రంప్ ప్రమాణం..వాషింగ్టన్ అంతటా భద్రత కట్టుదిట్టం

 ట్రంప్ ప్రమాణం..వాషింగ్టన్ అంతటా భద్రత కట్టుదిట్టం
  • రెండోసారి అమెరికా ప్రెసిడెంట్​గా రిపబ్లికన్ నేత బాధ్యతలు 
  • వాషింగ్టన్​లో మైనస్ 6 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
  • క్యాపిటల్ బిల్డింగ్ లోపలే ప్రమాణ స్వీకారం 
  • ట్రంప్ పాలసీలకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనలు
  • వాషింగ్టన్ అంతటా భద్రత కట్టుదిట్టం
  • ముందుగా చైనా, భారత్​లో పర్యటించే చాన్స్

వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ (78) సోమవారం రెండో సారి ప్రమాణం చేయనున్నారు. రాజధాని వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ బిల్డింగ్​లో మధ్యాహ్నం 12 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30కు) అమెరికా 47వ అధ్యక్షుడిగా ఆయనతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించనున్నారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా జేడీ వాన్స్ కూడా ప్రమాణం చేయనున్నారు. గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ డెమోక్రటిక్ నేత కమలా హారిస్ పై ట్రంప్ ఘన విజయం సాధించారు. షెడ్యూల్ ప్రకారం.. సోమవారం ప్రమాణం చేసి, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా వాషింగ్టన్  అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రంప్  ఇంతకుముందు 2017లో తొలిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2021 ఎన్నికల్లో ఆయనపై డెమోక్రటిక్ నేత జో బైడెన్(82) గెలిచి అధ్యక్షుడు అయ్యారు. ఇప్పుడు మళ్లీ బైడెన్ నుంచి ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్నారు.

క్యాపిటల్ బిల్డింగ్ లోపలే ప్రమాణం 

సాధారణంగా అమెరికా ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం వాషింగ్టన్​లోని క్యాపిటల్ బిల్డింగ్ ఆవరణలో మెట్లపై ఏర్పాటుచేసే బహిరంగ వేదికపై ఘనంగా జరుగుతుంది. వేలాది మంది గెస్టులు ప్రత్యక్షంగా వేడుకలకు హాజరయ్యేవారు. కానీ ఈసారి వాషింగ్టన్​లో సోమవారం టెంపరేచర్ మైనస్ 6 డిగ్రీలకు పడిపోతుందని, తీవ్రంగా చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గడ్డ కట్టే చలిలో బహిరంగంగా వేడుకలు నిర్వహించడం కష్టం కాబట్టి ఈసారి క్యాపిటల్ బిల్డింగ్​లో డోమ్ కింద ఉన్న విశాలమైన ఆవరణలో ప్రమాణ స్వీకారం చేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. దీంతో ఈసారి ట్రంప్ ప్రమాణ స్వీకారాన్ని నేరుగా చూసే అవకాశం కొద్దిమందికి మాత్రమే దక్కనుంది.

రెండ్రోజుల ముందే వేడుకలు షురూ..

ట్రంప్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో శనివారం (18వ తేదీ) నుంచే అధికారిక వేడుకలు ప్రారంభమయ్యాయి. ముందుగా శనివారం రాత్రి వర్జీనియాలోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ వద్ద మిరుమిట్లు గొలిపే ఫైర్ వర్క్స్ తో వేడుకలు అధికారికంగా షురూ అయ్యాయి. అనంతరం ట్రంప్ శనివారమే వాషింగ్టన్​కు చేరుకున్నారు. ఆదివారం (19వ తేదీ) మధ్యాహ్నం వాషింగ్టన్​లోని ఆర్లింగ్టన్ నేషనల్ సిమెటరీలో అమరవీరులకు ట్రంప్ నివాళులు అర్పించారు. ఇక సోమవారం 20వ తేదీన ఉదయం వాషింగ్టన్​లోని సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చ్​లో ట్రంప్ ప్రేయర్స్​లో పాల్గొంటారు. అక్కడి నుంచి వైట్ హౌస్​కు చేరుకుంటారు. ఉదయం 9.30 గంటలకు క్యాపిటల్ బిల్డింగ్ వెస్ట్ లాన్​లో ప్రముఖ సింగర్ క్యారీ అండర్ వుడ్ ‘‘అమెరికా ది బ్యూటిఫుల్” గేయం ఆలాపనతో లైవ్ పర్ఫార్మెన్స్​లు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు క్యాపిటల్ బిల్డింగ్​లో డోమ్ కింద రొటుండా ఆవరణలో ట్రంప్ ప్రమాణం చేస్తారు. అనంతరం ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. ఆ తర్వాత మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ కు అధికారికంగా వీడ్కోలు పలుకుతారు. అనంతరం సెనెట్ చాంబర్ కు చేరుకుని, కీలకమైన ఫైళ్లపై ట్రంప్ సంతకాలు చేస్తారు. ఆ తర్వాత క్యాపిటల్ బిల్డింగ్​లో విందులో పాల్గొంటారు. మంగళవారం 21వ తేదీన ఉదయం 10 గంటలకు వాషింగ్టన్ నేషనల్ క్యాథెడ్రల్​లో నేషనల్ ప్రేయర్ సర్వీస్ కార్యక్రమంతో వేడుకలు ముగియనున్నాయి.  కాగా,  ట్రంప్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఆయన పాలసీలకు వ్యతిరేకంగా ఆదివారం వాషింగ్టన్​కు చెందిన వేలాది మంది నిరసన ర్యాలీలు నిర్వహించారు. 

భారత్, చైనాలో పర్యటించనున్న ట్రంప్ 

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి విదేశీ పర్యటనలో భాగంగా చైనా, భారత్ ను ట్రంప్ సందర్శించనున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక వెల్లడించింది. చైనాతో వాణిజ్య సంబంధాలను మెరుగుపర్చుకునే ఉద్దేశంతో ఆ దేశంలో పర్యటించాలని ట్రంప్ భావిస్తున్నట్టు పేర్కొంది. భారత పర్యటన విషయంలోనూ ట్రంప్ తన అడ్వైజర్లతో చర్చించారని, వచ్చే ఏప్రిల్​లో ఆయన భారత్​లో పర్యటించే అవకాశం ఉందని పేర్కొంది.

ట్రంప్ ను కలిసిన అంబానీ 

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ కూడా ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. శనివారమే వాషింగ్టన్ కు చేరుకున్న వీరిద్దరూ సాయంత్రం ట్రంప్ ను కలిశారు. శనివారం రాత్రి కుటుంబం, మద్దతుదారులు, ముఖ్యమైన అనుచరులకు ట్రంప్ ఇచ్చిన విందులో ముకేశ్, నీతా అంబానీలు కూడా పాల్గొన్నారు.

హాజరుకానున్న గెస్టులు వీళ్లే..

ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఆయన కేబినెట్ నామినీలతోపాటు కొద్దిమంది గెస్టులు మాత్రమే హాజరుకానున్నారు. టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, మెటా ఓనర్ మార్క్ జుకర్ బర్గ్, టిక్ టాక్ అధినేత షౌ చౌ వంటివారు ఈ లిస్టులో ఉన్నారు. తాజా మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్, తాజా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి బుష్, బరాక్ ఒబామా హాజరుకానున్నారు. అమెరికా అధ్యక్షుడి ప్రమాణానికి విదేశాల అధినేతలకు ఆహ్వానం పంపే ఆనవాయితీ లేకపోయినా.. ఈసారి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు స్థానిక మీడియా తెలిపింది. హంగరీ ప్రధాని విక్టర్ ఓర్బన్, అర్జెంటినా ప్రెసిడెంట్ జేవియర్ మిలీ, చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్​నూ ఆహ్వానించగా.. జిన్ పింగ్ రావట్లేదని, మెలోనీ హాజరవుతున్నారని పేర్కొంది.