- రాష్ట్ర పోలీస్ అకాడమీని సందర్శించిన యూఎస్ అధికారులు
హైదరాబాద్, వెలుగు : హిమాయత్‌సాగర్ ఏరియాలోని రాష్ట్ర పోలీస్ అకాడమీని యూఎస్ మిషన్‌కు చెందిన ఓవర్సీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ వింగ్ అధికారులు శుక్రవారం సందర్శించారు. కేసుల దర్యాప్తునకు సంబంధించిన సహకారంపై అకాడమీ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఓవర్సీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అధికారులు అబ్రహం రామిరేజ్, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ ఓవర్సీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ హెడ్ ఎరిన్ ఫిషర్‌కు అకాడమీ డైరెక్టర్ ఏఆర్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు.
అనంతరం ఏఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పోలీస్ అకాడమీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు 29 వేల 931 మందికి ఇండక్షన్ ట్రైనింగ్ ఇచ్చామన్నారు. లక్షా10 వేల 489 మంది ఇన్ సర్వీస్ వారికి శిక్షణ అందించామని తెలిపారు. అకాడమీలోని వసతులు, శిక్షణకు సంబంధించిన అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డిప్యూటీ డైరెక్టర్ అనసూయ వివరించారు. ఔట్ డోర్, ఇన్‌డోర్ అధికారులతో దర్యాప్తు సంబంధించిన అంశాలపై చర్చించారు.