న్యూయార్క్: ఈ సీజన్ వింబుల్టన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గి జోరు మీదున్న చెక్ రిపబ్లిక్ స్టార్ బార్బోరా క్రెజికోవాకు యూఎస్ ఓపెన్‌లో చుక్కెదురైంది. మెగా టోర్నీలో రెండో రౌండ్‌లోనే అనామక ప్లేయర్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో రొమేనియాకు చెందిన క్వాలిఫయర్ ఎలెనా గాబ్రియెలా రూస్ 6–4, 7–5తో ఎనిమిదో సీడ్ క్రెజికోవాకు షాకిచ్చి మూడో రౌండ్ చేరింది. గంటా 45 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్ ఏడో గేమ్‌లో క్రెజికోవా సర్వీస్ బ్రేక్ చేసిన రూస్ పదో గేమ్‌లో సెట్ నెగ్గింది. హోరాహోరీగా సాగిన రెండో సెట్‌లో ఇద్దరు ప్లేయర్లు చెరో గేమ్ నెగ్గుతూ ముందుకెళ్లారు. 5–5తో స్కోరు సమంగా ఉన్న దశలో రూస్ విజృంభించింది. క్రెజికోవా తప్పిదాలను సద్వినియోగం చేసుకుంటూ 11, 12వ గేమ్స్‌లో వరుసగా ఎనిమిది పాయింట్లు నెగ్గిన 122వ ర్యాంకర్ రూస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో తొలిసారి మూడో రౌండ్ చేరింది. ఈ పోరులో 8 ఏస్‌లు, 4 బ్రేక్ పాయింట్లు, 28 విన్నర్లు సాధించిన రూస్ మూడు డబుల్ ఫాల్ట్స్, 15 అనవసర తప్పిదాలు చేసింది. ఆరు ఏస్‌లు, 27 విన్నర్లు కొట్టిన క్రెజికోవా రెండు బ్రేక్ పాయింట్లకే పరిమితం అయింది. 7 డబుల్ ఫాల్ట్స్, 24 అనవసర తప్పిదాలు చేసి ఓడింది. మరో మ్యాచ్‌లో 14వ సీడ్ మాడిసన్ కీస్ 6–4, 6–0 మయా జయింట్ (ఆస్ట్రేలియా)ను ఓడించగా, 26వ సీడ్ పాలో బడోసా (స్పెయిన్) 6–3, 7–5తో టౌన్సెడ్ (అమెరికా)పై నెగ్గి
మూడో రౌండ్ చేరారు.
ఒసాకా నాలుగేండ్ల తర్వాత
మెగా టోర్నీలో రీఎంట్రీ ఇచ్చిన జపాన్ స్టార్, మాజీ వరల్డ్ నంబర్ వన్ నవోమి ఒసాకా నాలుగేండ్ల తర్వాత తొలిసారి టాప్–10 ప్లేయర్‌పై విజయం సాధించింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో అన్‌సీడెడ్ ఒసాకా 6–3, 6–2తో ఒస్తపెంకో (లాత్వియా)పై సులువుగా నెగ్గింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ రిబరికా (కజకిస్తాన్) 6–1, 7–6 (7/1)తో డెస్టానీ ఐవా (ఆస్ట్రేలియా)ను ఓడించగా, ఐదో సీడ్ జాస్మిన్ పౌలిని (ఇటలీ) 6–7 (5/7), 6–2, 6–4తో స్విస్ ప్లేయర్ బ్రియాంక ఆండ్రెస్కూపై గెలిచింది. ఆరో సీడ్ జెస్సికా పెగులా (అమెరికా) 6–4, 6–3తో తోటి ప్లేయర్ షెల్బీ రోజర్స్‌ను చిత్తు చేసింది. అమెరికన్ సోఫియా కెనిన్ 6–1, 3–6, 6–4తో యూకే స్టార్ రదుకానును ఓడించింది.
సినర్ కష్టంగా..
మెన్స్ సింగిల్స్‌లో టాప్ సీడ్ జానిక్ సినర్ (ఇటలీ) 2–6, 6–2, 6–1, 6–1తో మకి మెక్‌డొనాల్డ్ (అమెరికా)పై గెలిచి రెండో రౌండ్ చేరాడు. మరో మ్యాచ్‌లో స్పెయిన్ యంగ్‌స్టర్, మూడో సీడ్ అల్కరాజ్ 6–2, 4–6, 6–3, 6–1తో లి టు (ఆస్ట్రేలియా)పై గెలిచి ముందంజ వేశాడు. ఐదో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) 6–3, 3–6, 6–3, 6–1తో లజోవిచ్ (క్రొయేషియా)ను ఓడించగా, అన్‌సీడెడ్ కొకినాకిస్ (ఆస్ట్రేలియా) 7–6 (7/5), 4–6, 6–3, 7–5తో 11వ సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)కు షాకిచ్చాడు.
ఐదున్నర గంటల మ్యాచ్
బ్రిటన్ ఆటగాడు డాన్ ఎవాన్స్, రష్యా ప్లేయర్ కారెన్ కచనోవ్ మధ్య తొలి రౌండ్ పోరు ఏకంగా ఐదు గంటల 35 నిమిషాలు సాగి ఈ టోర్నీలో ఎక్కువ సమయం తీసుకున్న మ్యాచ్‌గా రికార్డుకెక్కింది. ఈ మ్యాచ్‌లో ఎవాన్స్ 6-–7 (6/8), 7–-6 (7/2), 7–-6 (7/4), 4-–6, 6–-4 తో 21వ సీడ్ కచనోవ్‌ను ఓడించాడు.
బాలాజీ, భాంబ్రీ ముందంజ
మెన్స్ డబుల్స్‌లో ఇండియా ఆటగాళ్లు యూకీ భాంబ్రీ, శ్రీరామ్ బాలాజీ శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో భాంబ్రీ–ఒలీవిటి (ఫ్రాన్స్) 6–3, 6–4తో సెగెర్మన్–పాట్రిక్ (అమెరికా)పై , బాలాజీ–ఆండ్రియోజీ (అర్జెంటీనా) 5–7, 6–1, 7–6 (12/10) తో డానియెల్ (ఆస్ట్రేలియా)–మిగ్గెల్ రెయెస్ (మెక్సికో)పై గెలిచారు.