ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. డబ్ల్యూటీఓకు నిధులు కట్

ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. డబ్ల్యూటీఓకు నిధులు కట్

 

  • పలు ఎగ్జిక్యూటివ్  ఆర్డర్లపై కోర్టుల నిషేధం 

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్   మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరల్డ్  ట్రేడ్  ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ)కు అమెరికా నిధులు నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. దాంతోపాటు పలు అంతర్జాతీయ సంస్థల  నుంచీ అమెరికాను తప్పించారు. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి అమెరికా తప్పుకున్నదని ఆయన ప్రకటించారు. వాస్తవానికి 2019 లోనే తన మొదటి టర్ములో డబ్ల్యూటీఓలో కొత్త జడ్జీల నియామకాలపై ఆయన నిషేధం విధించారు. వర్తక వివాదాల్లో ఇప్పటికే డబ్ల్యూటీఓకు జడ్జీల సంఖ్య అవసరం కన్నా ఎక్కువగా ఉందని అమెరికా కొన్నేళ్లుగా ఆరోపిస్తున్నది. ఇక 2024లో ఈ సంస్థ బడ్జెట్  232 మిలియన్  డాలర్లుకాగా.. అమెరికా అందులో 11 శాతం కేటాయించాల్సి ఉంది. కాగా, ఫెడరల్  కాంట్రాక్టర్లో వైవిధ్యం, సమానత్వం, సమ్మిళితనానికి చెక్  పెట్టేందుకు ట్రంప్  జారీచేసిన ఎగ్జిక్యూటివ్  ఆర్డర్లలో కొన్నింటిని అమలు చేయకుండా యూఎస్  కార్మిక శాఖపై ఇలినాయిస్  నార్తర్న్  డిస్ట్రిక్ట్  కోర్టు జడ్జి మ్యాథ్యూ కెన్నెల్లీ నిషేధం విధించారు. అలాగే, మిలిటరీలో ట్రాన్స్ జెండర్లను నియమించకుండా నిషేధం విధిస్తూ ట్రంప్  జారీచేసిన మరో ఎగ్జిక్యూటివ్  ఆర్డర్ ను వాషింగ్టన్ లో ఫెడరల్  కోర్టు జడ్జి బెంజమిన్  సెటిల్  బ్లాక్  చేశారు.

వైట్ హౌస్ లో ఇఫ్తార్ విందు..  

ప్రెసిడెంట్  ట్రంప్  గురువారం వైట్ హౌస్ లో ఇఫ్తార్  విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు తాను ఇచ్చిన హామీలను నిలబెడతానన్నారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం తీవ్రంగా కృషి చేస్తున్నానని చెప్పారు. నిరుటి  అధ్యక్ష ఎన్నికల్లో తనకు సపోర్టు చేసిన వేల మంది ముస్లింలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు.