
- ప్రపంచంలోని ప్రతి దేశంపై కనీసం10% సుంకం: ట్రంప్
- ఇండియా 52% టారిఫ్‌లు వేస్తుండగా.. అందులో సగం 27% ప్రకటన
- మనుషులు లేని అంటార్కిటికాపైనా 10% సుంకం
- చైనా, ఈయూ, వియత్నాం, తైవాన్, జపాన్‌పైనా బాదుడు
- ఏప్రిల్ 5, 10 తేదీల నుంచే అమలులోకి
న్యూయార్క్: ముందే చెప్పినట్టు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల బాంబు పేల్చారు. అమెరికాపై సుంకాలు విధిస్తున్న ప్రపంచ దేశాలపై రెసిప్రోకల్ టారిఫ్‌లు విధించారు. దాదాపు 60 దేశాలపై అధిక సుంకాల మోత మోగించారు. ప్రపంచ దేశాలన్నీ తమ ఉత్పత్తులను తమ దేశంలో విక్రయించుకోవచ్చని, అయితే.. కనీసం 10శాతం ట్యాక్స్ చెల్లించాలని ట్రంప్ తెలిపారు. అమెరికా ప్రొడక్ట్స్‌పై అధిక శాతం ట్యాక్స్ వేస్తున్న దేశాలపై మాత్రం.. ఆయా దేశాలు విధిస్తున్న ట్యాక్స్‌లో సగం శాతం తాము విధిస్తున్నట్టు తెలిపారు.
వాహనాలు, వాహన విడిభాగాలపై 25 శాతం టారిఫ్ ఉంటుందని తెలిపారు. బుధవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్ రోజ్‌గార్డెన్‌లో ట్రంప్ వివిధ దేశాలపై విధిస్తున్న రెసిప్రోకల్ట్యాక్స్ వివరాలను వెల్లడించారు. వీటికి సంబంధించిన అధికారిక ఆదేశాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇది లిబరేషన్ డే. చాలా కాలంగా ఎదురుచూస్తున్న క్షణం. 2025 ఏప్రిల్ 2.. అమెరికన్ పరిశ్రమ పునర్జన్మ పొందిన రోజు. అమెరికా విధిని పునరుద్ధరించిన రోజు. అమెరికాను మళ్లీ సంపన్నంగా మార్చడం ప్రారంభించిన రోజుగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మేం దానిని సంపన్నంగా మార్చబోతున్నాం" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
భారత్‌పై 27 శాతం టారిఫ్
భారత్, చైనా, జపాన్, థాయ్‌లాండ్, వియత్నాం తమపై అధిక సుంకాలు వేస్తున్నాయని ట్రంప్ గుర్తు చేశారు. అమెరికా ప్రొడక్ట్స్‌పై ఆయాదేశాలు విధిస్తున్న ట్యాక్స్‌ల చార్ట్‌ను ట్రంప్ చేతిలో పట్టుకొని, మాట్లాడారు. కరెన్సీ మానిప్యులేషన్, వాణిజ్య అడ్డంకులు సహా భారతదేశం 52 శాతం టారిఫ్‌లను వసూలు చేస్తుందని చార్ట్ లో ఉండగా.. అమెరికా ఇప్పుడు భారత్‌నుంచి 26 శాతం రెసిప్రోకల్ ట్యాక్స్‌ను వసూలు చేస్తుందని తెలిపారు. అయితే, వైట్‌హౌస్ పత్రాల ప్రకారం భారత్‌పై 27 శాతం సుంకంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్భారత్నుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘భారత్ చాలా కఠినమైనది. ఆ దేశ ప్రధాని నన్ను కలిసి వెళ్లిపోయారు. మీరు నాకు మంచి స్నేహితులు.. కానీ మీరు మాతో సరిగ్గా వ్యవహరించడం లేదని చెప్పా. వారు (భారత్) మననుంచి 52 శాతం ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. కానీ. మనం ఏండ్లుగా.. దశాబ్దాలుగా వారినుంచి ఏమీ వసూలు చేయలేదు” అని వ్యాఖ్యానించారు. కాగా, చైనాపై 34 శాతం, ఐరోపా కూటమిపై 20 శాతం, వియత్నాంపై 46 శాతం, తైవాన్‌పై 32 శాతం, జపాన్‌పై 24 శాతం రెసిప్రోకల్ ట్యాక్స్ విధించారు.
ఈ టారిఫ్‌లు రెండు దశల్లో అమల్లోకి వస్తాయని తెలిపారు. మొదటి దశలో అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 10% బేస్‌లైన్ టారిఫ్ ఏప్రిల్ 5 నుంచి, రెండో దశలో, దాదాపు 60 దేశాలపై అధిక రేట్లతో కూడిన రెసిప్రోకల్ టారిఫ్‌లు ఏప్రిల్ 10 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు.
పెంగ్విన్లు ఉండే దీవులపైనా..
ప్రపంచంలోని అన్ని దేశాలపై ట్యాక్స్‌లు వేసిన ట్రంప్ మనుషుల్లేని అంటార్కిటికాను కూడా వదల్లేదు. జనసంచారమే లేని, కేవలం పక్షులు, పెంగ్విన్లు మాత్రమే నివాసం ఉండే ఆ దీవులపై ట్యాక్స్ ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆస్ట్రేలియా నియంత్రణలోని హియర్డ్, మెక్‌డొనాల్డ్ ఐలాండ్‌లపై 10 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మండిపడ్డారు. ట్రంప్ టారిఫ్‌ల నుంచి భూమిపై ఎక్కడా రక్షణ లేదని అన్నారు. కాగా, ఈ దీవులు ఆస్ట్రేలియన్ భూభాగంలో ఉండడం వల్లే టారిఫ్ విధించామని వైట్‌హౌస్ అధికారి ఒకరు తెలిపారు.