
- అద్భుతమైన ఆఫర్లు ఇవ్వండి
- టారిఫ్ అమలుపై మరోసారి ఆలోచిస్తా: ట్రంప్
- సుంకాలపై చర్చించేందుకు మేము రెడీ
- ఇది పరస్పర చర్య మాత్రమే..ప్రతీకార చర్య కాదని కామెంట్
వాషింగ్టన్: టారిఫ్‌లు విధించిన దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ఆఫర్ ఇచ్చాడు. ఆయా దేశాలు అమెరికా విషయంలో అద్భుతమైన ఆఫర్లు ప్రకటిస్తే సుంకాలు విధించే విషయంలో మరోసారి ఆలోచిస్తానని తెలిపాడు. టారిఫ్‌లపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఏయిర్‌ఫోర్స్ వన్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
‘‘ఆయా దేశాలపై ప్రకటించిన టారిఫ్‌లు ఈ నెల 9వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఇందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయితే, ఆయా దేశాలు సుంకాలపై చర్చించేందుకు ముందుకొస్తే మేమూ రెడీగా ఉన్నాం. అమెరికాకు ప్రయోజనం చేకూర్చేలా మంచి ఆఫర్లు ప్రకటించాలి. గడిచిన నాలుగేండ్లు చాలా దేశాలు అమెరికాను టారిఫ్‌ల రూపంలో దోచుకున్నాయి.
దాని ఆధారంగానే మేము తాజాగా టారిఫ్‌లు అనౌన్స్ చేశాం. ఇది పరస్పర చర్య మాత్రమే. ప్రతీకార చర్య అస్సలు కాదు. సుంకాలపై అధికారిక ప్రకటన చేయగానే కొన్ని దేశాలు అమెరికా గురించి ఆలోచించడం మొదలుపెట్టాయి. ఇది మేము సాధించిన ఓ విజయంగానే భావిస్తున్నాం. తాము తీసుకున్న టారిఫ్ నిర్ణయంతో అభివృద్ధిలో అమెరికా పరుగులుపెడ్తుందని మాత్రం చెప్పగలను.
కొన్ని దేశాలు అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచిస్తున్నాయి. అలాంటి దేశాలు ముందుకు రావాలి. అప్పుడే సుంకాల అమలుపై చర్చించేందుకు వీలవుతుంది’’అని ట్రంప్ అన్నారు. కాగా, ఇండియాపై కూడా అమెరికా 26 శాతం టారిఫ్ విధించింది. దీంతో జ్యూవెల్లరీ, ఆటో రంగంపై ఒత్తిడి పెరిగింది. అయితే, ఇప్పటికే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌తో ఇండియా ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించింది. ఇతర దేశాలతో పోలిస్తే.. అమెరికాతో చర్చల విషయంలో ఇండియా ముందున్నది.
చైనా బెదిరింది: ట్రంప్
టారిఫ్ ల అంశంలో చైనా తమపై ప్రతీకార సుంకాలు ప్రకటించడం ద్వారా తప్పులో కాలేసిందని, ఆ దేశం బెదురుకున్నదని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. ‘‘చైనా భయపడింది. తప్పులో కాలేసింది. వాళ్లు చేయలేని పనిని చేసేలా ప్యానిక్ అయ్యారు” అని ఆయన శుక్రవారం ఈ మేరకు ట్రూత్ సోషల్ లో పోస్ట్ పెట్టారు.