
వాషింగ్టన్: అంతరిక్షం నుంచి 9 నెలల తర్వాత భూమి మీదకు తిరిగొచ్చిన నాసా ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ ఓవర్ టైం శాలరీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఆస్ట్రోనాట్ల ఓవర్ టైం శాలరీ గురించి మీడియా ప్రతినిధులు ట్రంప్ను అడగ్గా.. ఈ అంశాన్ని ఎవరూ తన దృష్టికి తీసుకురాలేదని, తన సొంత డబ్బు నుంచి ఆస్ట్రోనాట్లకు అదనపు జీతం చెల్లిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఎనిమిది రోజుల మిషన్ కోసమని అంతరిక్షానికి వెళ్లిన భారత సంతతి అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, అమెరికన్ ఆస్ట్రోనాట్ బ్యారీ విల్ మోర్9 నెలల తర్వాత భూమి మీద అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
సునీతా విలియమ్స్, విల్ మోర్ నాసాలో జీఎస్–15 కేటగిరీ ఫెడరల్ ఎంప్లాయిస్. ఈ ఇద్దరి జీతం సంవత్సరానికి సుమారు కోటీ 8 వేల నుంచి కోటీ 41 లక్షల వరకూ ఉంటుంది. ఈ లెక్కన.. ఈ తొమ్మిది నెలలు ఐఎస్ఎస్లో ఉన్నందుకు నాసా ఈ ఇద్దరికీ 81 లక్షల నుంచి కోటీ 5 లక్షల దాకా చెల్లించాలి. అయితే.. వాస్తవానికి నాసా షెడ్యూల్ ప్రకారం.. ఈ మిషన్ వ్యవధి ఎనిమిది రోజులే. కానీ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యల కారణంగా తొమ్మిది నెలలుగా సునీతా విలియమ్స్, విల్ మోర్ అక్కడే చిక్కుకుపోయారు.
ఓవర్ టైం ఉన్నందుకు నాసా అదనంగా ఏం చెల్లించకపోగా రోజుకు 4 డాలర్లు మాత్రమే ఈ తొమ్మిది నెలల కాలానికి సునీతా విలియమ్స్, విల్ మోర్కు చెల్లించనుంది. అంటే.. రోజుకు కేవలం 347 రూపాయలు మాత్రమే. సునీతా విలియమ్స్, విల్ మోర్ 8 రోజులకు బదులుగా ఉన్న ఈ 287 రోజుల కాలానికి వారికి దక్కేది కేవలం 1,148 డాలర్లు మాత్రమే. మన కరెన్సీలో 99 వేల 816 రూపాయలు. అంత రిస్క్ చేసినా అదనపు వేతనం అంత తక్కువ చెల్లించడం ఏంటని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో.. మీడియా ప్రతినిధులు ఈ విషయంలో ట్రంప్ను స్పష్టత కోరారు. ట్రంప్ తన సొంత డబ్బును ఇద్దరు ఆస్ట్రోనాట్ల అదనపు వేతనంగా చెల్లిస్తానని మీడియా ముందు ప్రకటించడం గమనార్హం.