
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. భారత ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడని అంటూనే.. ఇండియాపై కూడా 26 శాతం పరస్పర సుంకం (రెసిప్రోకల్ టారిఫ్స్) విధించారు. అయితే.. ఇండియాపై విధించిన రెసిప్రోకల్ టారిఫ్స్పై డిస్కౌంట్ ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికాను మరోమారు ధనిక దేశంగా మార్చే సమయం వచ్చిందని ట్రంప్ రోజ్ గార్డెన్లో ఏప్రిల్ 2న జరిగిన ‘అమెరికా లిబరేషన్ డే’ ఈవెంట్లో వ్యాఖ్యానించారు.
అమెరికాపై భారత్ 52 శాతం సుంకం విధిస్తుందని చెప్పుకొచ్చిన ట్రంప్.. అందులో సగం.. అంటే 26 శాతం సుంకం మాత్రమే ఇండియా నుంచి వసూలు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇండియాపై మాత్రమే కాదు అన్ని దేశాలపై తక్కువలో తక్కువ 10 శాతం పరస్పర సుంకాలను ట్రంప్ విధించారు. ట్రంప్ విధించిన ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ వల్ల 100 దేశాలపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా చైనా, ఇండియా, జపాన్, వియత్నాం వంటి 60 దేశాలకు అధిక సుంకాల భారం గుదిబండగా మారనుంది.
అమెరికా మనదేశ ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు విధించడం వల్ల చాలా రంగాలు నష్టపోతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సుంకాల మధ్య భారీ తేడా ఉన్న రంగాలపై ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. అంటే అమెరికా కంటే ఇండియా వసూలు చేసే సుంకాలు ఎక్కువగా ఉన్న రంగాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. వ్యవసాయం, విలువైన రాళ్ళు, రసాయనాలు, ఫార్మా, వైద్య పరికరాలు, ఎలక్ట్రికల్, యంత్రాల తయారీ కంపెనీలు నష్టపోతాయి.
ట్రంప్ ఏఏ దేశంపై.. ఎంత రెసిప్రోకల్ టారిఫ్ విధించారంటే..
1. ఇండియా- (26 శాతం)
2. శ్రీలంక (44 శాతం )
3. బంగ్లాదేశ్ (37 శాతం)
4. కాంబోడియా (49 శాతం)
5. మడగాస్కర్ (47 శాతం)
6. వియత్నాం (46 శాతం)
7. మయన్మార్ (బర్మా) (44 శాతం)
8. సెర్బియా (37 శాతం)
9. థాయ్ లాండ్ (36 శాతం)
10. చైనా (34 శాతం)
11. తైవాన్ (32 శాతం)
12. ఇండోనేషియా (32 శాతం)
13. స్విట్జర్లాండ్ (31 శాతం)
14. దక్షిణ ఆఫ్రికా (30 శాతం)
15. పాకిస్తాన్ (29 శాతం)
16. దక్షిణ కొరియా (25 శాతం)
17. జపాన్ (24 శాతం)
18. మలేషియా (24 శాతం)
19. యూరోపియన్ యూనియన్ (20 శాతం)
20. జోర్డాన్ (20 శాతం)
21. ఫిలిప్పైన్స్ (17 శాతం)
22. ఇజ్రాయెల్ (17 శాతం)
23. నార్వే (15 శాతం)
24. టర్కీ (10 శాతం)
25. పెరు (10 శాతం)
26. యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (10 శాతం)
27. న్యూజిలాండ్ (10 శాతం)
28. అర్జెంటైనా (10 శాతం)
29. ఈక్వెడార్ (10 శాతం)
30. ఈజిప్ట్ (10 శాతం)
31. సౌదీ అరేబియా (10 శాతం)
32. మొరాకో (10 శాతం)
33. బ్రెజిల్ (10 శాతం)
34. సింగపూర్ (10 శాతం)
35. చిలీ (10 శాతం)
36. ఆస్ట్రేలియా (10 శాతం)
37. కొలంబియా (10 శాతం)
38. యునైటెడ్ కింగ్డమ్ (10 శాతం)