అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తూనే.. మున్ముందు తన పాలన ఎలా ఉంటుందో ప్రకటనల ద్వారా చెబుతున్నారు. అమెరికాతో ఇతర దేశాల వాణిజ్య అంశాల నుంచి రాజకీయ అంశాలపై వరుస కామెంట్లు చేస్తున్నారు. తాజాగా మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నిరోధిస్తానన్నారు ట్రంప్. మిడిల్ ఈస్ట్ దేశాల్లో గందరగోళాన్ని ఆపివేస్తానని చెప్పారు.
ఇజ్రాయెల్, -హమాస్ మధ్య యుద్ధం వచ్చే సమయానికి తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే యుద్ధం రాకుండా ఆపేవాడినని చెప్పారు. వాషింగ్టన్ డీసీలో మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ విక్టరీ ర్యాలీలో పాల్గొన్న ట్రంప్.. ప్రభుత్వ సమర్థత మెరుగుపరచడానికి ఎలాన్ మస్క్ నేతృత్వంలో కొత్త విభాగం ఏర్పాటు చేస్తానని చెప్పారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని బహిష్కరిస్తానని తెలిపారు. కొత్తగా అమెరికాకు వచ్చే వారి విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తామని తెలిపారు.