మహిళా కోటాలో ట్రాన్స్జెండర్లకు నో ఎంట్రీ : ట్రంప్ సంతకం పెట్టేశాడు..!

మహిళా కోటాలో ట్రాన్స్జెండర్లకు నో ఎంట్రీ : ట్రంప్ సంతకం పెట్టేశాడు..!

వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళల క్రీడల్లో ట్రాన్స్జెండర్లకు ఇకపై ఎలాంటి కోటా ఉండబోదని, అమెరికాలో మహిళల క్రీడలు ఇకపై కేవలం మహిళలకు మాత్రమేనని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై బుధవారం(ఫిబ్రవరి 5) ట్రంప్ సంతకం కూడా పెట్టేశారు. ‘‘మహిళల క్రీడల నుంచి పురుషులను గెంటేస్తున్నాం’’ అనే టైటిల్తో ఆర్డర్ ఉండటం విశేషం. ట్రంప్ తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Also Read :- గంటకు 24 లక్షల ఖర్చు.. ఆర్మీ విమానాల్లోనే ఎందుకు..?

ఎన్నికల్లో చెప్పినట్లే.. వరసగా పలు కీలక నిర్ణయాలను అమలు చేస్తూ ట్రంప్ దూకుడుగా ఉన్నారు. అమెరికాలో ఇప్పటి వరకు స్పోర్ట్స్ కోటా కింద ఉన్న ట్రాన్స్ జెండర్ల వ్యవహారంపై కీలకమైన ఆర్డర్స్ ఇస్తూ.. సంతకాలు చేసేశారు ట్రంప్. అథ్లెటిక్స్ గేమ్స్.. మహిళా కోటా కింద ఉన్న ట్రాన్స్ జెండర్ల విధానాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చేశారు. బైడన్ అధ్యక్షుడు అయిన తర్వాత అథ్లెటిక్స్  లో ట్రాన్స్ జెండర్లను మహిళా కోటా కింద అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు ట్రంప్. ట్రాన్స్ జెండర్లు మహిళా కోటా కిందకు రారని తేల్చేసి.. ఈ మేరకు ఆ విధానాన్ని రద్దు చేస్తూ.. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చారు ట్రంప్.

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. యూఎస్ 47వ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే వరుసగా అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలతో ఆయన యాక్షన్ షురూ చేశారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) నుంచి, పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి అమెరికా బయటికి రావడం, యూఎస్ లో పుట్టే వలసదారుల పిల్లలకు బర్త్ రైట్ సిటిజన్ షిప్ హక్కు రద్దు, ఫెడరల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం రద్దు, ట్రాన్స్ జెండర్లకు హక్కుల తొలగింపు, విదేశాలకు సాయం తాత్కాలికంగా నిలిపివేత వంటి నిర్ణయాలు ఇందులో ఉన్నాయి. 

గత అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలతోపాటు ఆయన గద్దె దిగడానికి కొద్ది రోజుల ముందు తీసుకున్న పలు నిర్ణయాలను కూడా రివర్స్ చేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు.