జీ20 (G20 Summit) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షులు జో బైడెన్ భారత్ కు చేరుకున్నారు. సరిగ్గా సాయంత్రం 7 గంటలకు ఢిల్లీకి చేరుకున్నారు. ప్లాన్ ప్రకారమే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. బైడెన్ కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ ఘన స్వాగతం పలికారు.
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బైడెన్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో బైడెన్‌తో పాటు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్, ఇతర ఉన్నాధికారులు ఉన్నారు. జో బైడెన్ నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లి మోదీతో భేటీ కానున్నారు. ఇరుదేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించనున్నారు.
జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు తొలిసారి ఢిల్లీకి వచ్చారు బైడెన్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. రక్షణ, సాంకేతికత, వాణిజ్య రంగాలపై భారత్, అమెరికా మధ్య ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.
భారత్ కు వచ్చిన జో బైడెన్ ఢిల్లీలోని ఐటీసీ మౌర్యహోటల్ లో బస చేయనున్నారు. ఇప్పటికే అక్కడ ఆయనకు గ్రాండ్ ఏర్పాట్లు చేశారు. మరోవైపు.. భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
భారత్ అధ్యక్షతన సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీ వేదికగా జీ20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. శుక్రవారం (సెప్టెంబర్ 8న) రాత్రి అమెరికా అధ్యక్షుడి కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తున్నారు. విందు సమయంలో ఇద్దరు నేతల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగబోతోంది.
శుక్రవారం మధ్యాహ్నం మోదీ చేసిన ట్వీట్‌లోనూ ఈ ద్వైపాక్షిక సమావేశాన్ని ప్రస్తావించారు. శుక్రవారం రాత్రి తన ఇంట్లో మూడు ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొనబోతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లతో ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటున్నట్లు మోదీ తన ట్వీట్‌తో వెల్లడించారు.
జీ20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా మోదీ మొత్తంగా 15 ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటున్నారు. మోదీ, బైడెన్‌లు శుద్ధ ఇంధనాలు, వాణిజ్యం, టెక్నాలజీ, రక్షణ రంగాలకు సంబంధించిన అంశాలపైనా మాట్లాడుకునే అవకాశాలున్నట్లు నిపుణులు చెప్తున్నారు. రెండు దేశాల మధ్య వీసాల మంజూరు అంశం కూడా ప్రస్తావనకు రావొచ్చు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జో బైడెన్ తొలిసారి భారత్ కు వచ్చారు. ఆయన రాకతో, మోదీతో ద్వైపాక్షిక సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
#WATCH | G-20 in India: US President Joe Biden arrives in Delhi for the G-20 Summit
He will hold a bilateral meeting with PM Narendra Modi today pic.twitter.com/IVWUE0ft7E
— ANI (@ANI) September 8, 2023