అక్టోబర్​ 18న ఇజ్రాయెల్‌కు జో బైడెన్..

అక్టోబర్​ 18న ఇజ్రాయెల్‌కు జో బైడెన్..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం (అక్టోబర్​ 18న) ఇజ్రాయెల్‌కు వెళ్తున్నారు. పాలస్తీనా హమాస్‌ దాడులతో దెబ్బతిన్నఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపేందుకు బైడెన్‌ బుధవారం ఆ దేశానికి వెళ్లనున్నారని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌ చెప్పారు.

గాజాకు మానవతా సాయంపై ఇజ్రాయెల్​ ప్రధానమంత్రి నెతన్యాహుతో జో బైడెన్ చర్చలు జరుపుతారని ఆంటోనీ వెల్లడించారు. గాజాకు సహాయం చేసే విషయంలో ప్రణాళికను రూపొందించడానికి ఇరు దేశాలు అంగీకరించినట్లు చెప్పారు. గాజాలోని పౌరులకు మానవతా సహాయం అందించే విధంగా తన కార్యకలాపాలను నిర్వహించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు.. ఇదే విషయంపై జో బైడెన్ ఎక్స్‌ (ట్విట్టర్​) వేదికగా వెల్లడించారు. తాను బుధవారం ఇజ్రాయెల్‌కు వెళ్తున్నట్లు బైడెన్‌ తెలిపారు. హమాస్‌ ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా నిలుస్తామని స్పష్టం చేశారు. మానవతా సాయం అందించే విషయంపై అధికారులతో చర్చిస్తామన్నారు.