వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలి ఫలితం టై అయింది. న్యూ హాంప్‌షైర్ రాష్ట్రం కూస్ కౌంటీలోని డిక్స్‌విల్లే నాచ్‌లో నివాసం ఉంటున్న ఆరుగురు ఓటర్లు.. బాల్సమ్స్ రిసార్ట్‌లోని టిల్లోట్‌సన్ రూమ్‌లో సోమవారం అర్ధరాత్రి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 15 నిమిషాల తర్వాత ఎన్నికల అధికారులు ఓట్లు లెక్కించారు. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మూడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మూడు ఓట్లు పోలయ్యాయి. దీంతో తొలి ఫలితం 3–3తో టైతో ముగిసింది.
2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ 5–0 ఓట్ల తేడాతో డిక్స్‌విల్లే నాచ్‌ను కైవసం చేసుకున్నారు. 2016లో హిల్లరీ క్లింటన్ 4–2 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాగా, ఎన్నికల రోజున పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఆరుగురు ఓటర్లు బాల్సమ్స్ రిసార్ట్‌లో సమావేశం అవుతారు. జాతీయ గీతం ఆలపించిన తర్వాత.. అర్ధరాత్రి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 1960 నుంచి డిక్స్‌విల్లే నాచ్ కౌంటీలో ఇదే సంప్రదాయం కొనసాగుతున్నది.