వాషింగ్టన్: రష్యాకు ఆయుధాలు సరఫరా చేసినందుకు 15 భారతీయ కంపెనీలు, పలువురు వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధించింది. చైనా, స్విట్జర్లాండ్, థాయ్లాండ్, టర్కీకి చెందిన కంపెనీలను కూడా ఆంక్షల జాబితాలో చేర్చింది. ఈమేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ ట్రెజరీ తెలిపింది. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు అత్యాధునిక టెక్నాలజీ, ఆయుధాలు సమకూరుస్తున్నందుకు ఆ దేశాల కంపెనీలపై ఆంక్షలు విధించామని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. ఒక దేశంపై మరో దేశం చేస్తున్న దురాక్రమణను అడ్డుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నామని పేర్కొంది.
‘‘ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న అక్రమ, అనైతిక యుద్ధాన్ని అడ్డుకోవడమే మా లక్ష్యం. మా మిత్రపక్షాల ఉద్దేశం కూడా అదే. ప్రపంచవ్యాప్తంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటూనే ఉంటాం. రష్యా తన ఆయుధ సంపత్తిని మెరుగుపరుచుకోకుండా చూస్తాం. అలాగే, రష్యాకు అత్యాధునిక ఆయుధాలు, టెక్నాలజీని సమకూర్చాలనుకునే వారి ప్రయత్నాలను కూడా అడ్డుకుంటాం” అని డిపార్ట్ మెంట్ ఆఫ్ ట్రెజరీ తెలిపింది. అంతకుముందు కూడా ఇదే కారణంతో వివిధ దేశాలకు చెందిన 400 కంపెనీలపైనా అమెరికా ఆంక్షలు విధించింది.
భారతీయ చట్టపరిధిలోనే మా కంపెనీలు
ఇండియన్ కంపెనీలపై అమెరికా విధించిన ఆంక్షలకు భారత విదేశాంగ శాఖ స్పందించింది. తమ దేశ కంపెనీలు భారతీయ చట్టపరిధిలోనే పనిచేస్తున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ తెలిపారు. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ (అణ్వాయుధాలు, ఆయుధాల టెక్నాలజీని ఇతర దేశాలు సరఫరా చేసే ప్రయత్నాలను అడ్డుకునే ఒప్పందం) కు కట్టుబడి ఉన్నామని చెప్పారు. చట్టాలను ఉల్లంఘించి ఆ కంపెనీలు పనిచేయలేదని, ఈ విషయాన్ని అమెరికా అర్థం చేసుకోవాలని చెప్పారు.