విదేశాలకు సాయం ఆపేసిన ట్రంప్

విదేశాలకు సాయం ఆపేసిన ట్రంప్
  • ఉక్రెయిన్ సహా పలు దేశాలకు నో ఫండ్స్​
  • ఇజ్రాయెల్, ఈజిప్ట్​లకు మినహాయింపు
  • ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయంమేరకు
  • విదేశాంగ మంత్రి ఆదేశాలు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాలకు అందిస్తున్న మానవతా సాయాన్ని నిలిపివేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అమెరికా ఫస్ట్ పాలసీలో భాగంగా ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.  ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశాల మేరకు ఉక్రెయిన్ తో పాటు వివిధ దేశాలకు అమెరికా చేస్తున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అంతర్గత మెమో ఒకటి జారీ చేశారు. నిధుల విడుదలను ఆపేయాలని అందులో సూచించారు. కొత్తగా ఎలాంటి నిధులు విడుదల చేయడం కానీ, ఆర్థిక సాయానికి సంబంధించి ఇప్పటికే ముగిసిన ఒప్పందాలను రెన్యువల్ కానీ చేయొద్దన్నారు. అయితే, ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాలకు చేస్తున్న మానవతా సాయానికి మాత్రం ఈ ఆదేశాలు వర్తించవని, ఆ రెండు దేశాలకు ఆర్థిక సాయం కొనసాగిస్తామని పేర్కొన్నారు. అత్యవసర మందులు, ఆహారం, సైనిక సాయం కోసం నిధులు అందిస్తామని చెప్పారని అమెరికా మీడియా వార్తలు ప్రసారం చేసింది. 

చమురు ధరలు తగ్గించండి..ఒపెక్​కు విజ్ఞప్తి

చమురు ధరలు తగ్గించాలని పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  విజ్ఞప్తి చేశారు. ధరలు తగ్గిస్తే.. రష్యా, ఉక్రెయిన్  యుద్ధం ఆగిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, కాలిఫోర్నియాలోని కార్చిచ్చు సంభవించిన ప్రాంతాల్లో ప్రెసిడెంట్ ట్రంప్  శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఫెడరల్  ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్  ఏజెన్సీ నుంచి బయటకు వచ్చే ఆలోచన ఉందని తెలిపారు.

రక్షణ మంత్రిగా పీట్  హెగ్సేత్

అమెరికా రక్షణ శాఖ మంత్రిగా పీట్  హెగ్సేత్ (44) ను ఆ దేశ సెనేట్  కన్ఫమ్  చేసింది. ఉపాధ్యక్షుడు జేడీ  వాన్స్  చివర్లో టైబ్రేకర్  ఓటు వేయడంతో రక్షణ మంత్రిగా హెగ్సేత్  కన్ఫమ్  అయ్యారు.

ఇండియన్ అమెరికన్లు ముగ్గురికి..

ట్రంప్ తన ప్రభుత్వంలోకి మరో ముగ్గురు ఇండియన్ అమెరికన్లను చేర్చుకున్నారు. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్​లో సీనియర్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ బాధ్యతలను రికీ గిల్​కు,  ప్రెసిడెన్షియల్ పర్సనల్ స్టాఫ్ నియామక బాధ్యతలను సౌరభ్ శర్మకు, డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ బాధ్యతలను మాజీ జర్నలిస్ట్ కుష్ దేశాయ్​కి అప్పగించారు.