భారత్‌లో ఉంటున్న తమ దేశ పౌరులకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. భారత్ లోని మణిపూర్, జమ్ము కశ్మీర్, ఇండో పాక్ సరిహద్దులతో పాటు మావోయిస్టులు యాక్టివ్‌గా ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని వారికి సూచించింది. మరీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటే మళ్లీ ఒకసారి ఆలోచించుకోవాలంది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ రివైజ్డ్ ట్రావెల్ అడ్వైజరీ విడుదల చేసింది. దేశంలో పెరిగిపోతున్న నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలంది.
భారత్--పాకిస్థాన్ సరిహద్దులోని 10 కి.మీల పరిధిలో కాల్పులు జరిగే అవకాశం ఉందని తెలిపింది. దీంతో తమ పౌరులను అటువైపు వెళ్లొద్దంది. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదం పేట్రేగుతోందని అక్కడ పర్యటించొద్దని కోరింది. ఉగ్రవాదం, హింసాత్మక ఘటనలు అధికంగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించాల్సి వస్తే మరోసారి ఆలోచించుకోవాలంది. ఉగ్రవాదులు పర్యాటక ప్రాంతాలు, రవాణా కేంద్రాలు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటారని అమెరికా తెలిపింది.
ఈ ప్రాంతాల్లో చురుగ్గా మావోయిస్టులు..
తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ నుంచి పశ్చిమ బెంగాల్ కు వెళ్లే ఏరియాలో మావోయిస్టులు చురుగ్గా ఉంటాయని తెలిపింది. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, బిహార్, బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీలలో ప్రభుత్వ అధికారులపై మావోయిస్టుల దాడులు అధికంగా జరుగుతున్నాయని పేర్కొంది. ఒడిశాలోని నైరుతీ ప్రాంతంలోనూ ఈ ప్రభావం ఉందన్నారు. అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, మేఘాలయ, ఒడిశా రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. రాష్ట్రాల రాజధానులకు వెళ్తే అనుమతి అవసరం లేదని పేర్కొంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతానికి వెళ్లడానికి మాత్రం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలంది. ఈ మేరకు భారత్‌లో ఉన్న అమెరికన్లకు హెచ్చరికలు జారీ చేసింది.