- రష్యాపై యూఎస్ మరిన్ని ఆంక్షలు
- మార్చి నుంచి సప్లై ఆగిపోయే చాన్స్
న్యూఢిల్లీ: రష్యా చమురు రంగంపై అమెరికా విధించిన ఆంక్షలు భారతదేశంలోకి చమురు దిగుమతులపై ప్రభావం చూపడం ప్రారంభించాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) మార్చి డెలివరీలకు కార్గోలు లభించడం లేదని తెలిపింది.
రష్యా నుంచి ఆయిల్ సరఫరా ఆగిపోయే అవకాశం ఉండటంతో ఇండియన్ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) ఇతర మార్కెట్లవైపు చూస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం రష్యాపై ఆంక్షల డోసు పెంచడంతో మనదేశానికి ఫిబ్రవరి తరువాత ఆయిల్ సరఫరా ఆగిపోవచ్చని భావిస్తున్నారు.
రష్యా ఎనర్జీ రంగంపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ అమెరికా ప్రభుత్వం ఈ నెల 10న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రష్యన్ ఆయిల్ కంపెనీ గాజ్ప్రామ్, సర్గుట్నెఫ్టెగాస్లకు కష్టాలు మొదలయ్యాయి. రష్యా నుంచి ఆయిల్ తీసుకెళ్లే 183 నౌకలు బ్లాక్లిస్ట్ అయ్యాయి. డజను కంటే ఎక్కువ మంది ఆయిల్ వ్యాపారులు, ఆయిల్ఫీల్డ్ సర్వీస్ ప్రొవైడర్స్, ట్యాంకర్ ఓనర్స్, మేనేజర్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, అధికారులపై ఆంక్షలు మొదలయ్యాయి.
బీపీసీఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్) వెత్స రామకృష్ణ మాట్లాడుతూ బీపీసీఎల్డిసెంబరు క్వార్టర్లో ప్రాసెస్ చేసిన దానిలో రష్యా ఆయిల్ వాటా 31 శాతం ఉండగా, మార్చిలో అది 20 శాతానికి పడిపోయిందని అన్నారు.
40 శాతం ఆయిల్ రష్యా నుంచే
2022, మార్చి 31 వరకు మనదేశం ఆయిల్కొనుగోళ్లలో రష్యా వాటా 0.2 శాతం మాత్రమే ఉండేది. రష్యా అదే ఏడాది ఉక్రెయిన్పై దాడి చేయడంతో అది చాలా దేశాలకు ఆయిల్ అమ్మకుండా ఆంక్షలు మొదలయ్యాయి. దీంతో రష్యా ఇండియాకు చవకగా ఆయిల్ అమ్మడం మొదలుపెట్టింది.
ఫలితంగా అమ్మకాల వాటా ఏకంగా 40 శాతానికి పెరిగింది. గత ఏడాది రష్యా నుంచి రోజుకి 1.7 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ వచ్చేది. మొదట్లో బ్యారెల్కు 8.5 డాలర్లకు డిస్కౌంట్ఇచ్చేది. ఇది క్రమంగా తగ్గుతూ ఇప్పుడు మూడు డాలర్లకు పడిపోయింది.
ఆంక్షలు ఉన్న రష్యా ట్యాంకర్ల నుంచి ఆయిల్కొనొద్దని ఇండియా తాజాగా నిర్ణయించింది. అవి ఇండియా రావడానికి అనుమతులు లేకపోవడమే కారణం. దీనికితోడు రష్యా క్రూడాయిల్ బ్యారెల్ధర 60 డాలర్లపైన ఉండటంతో ఇన్సూరెన్స్కూడా వర్తించడం లేదు. రష్యా ఆయిల్ సరఫరా భారీగా తగ్గిపోవడంతో గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ బ్యారెల్ ధర 84 డాలర్లకు ఎగిసింది.