వాషింగ్టన్: కంటినిండా నిద్ర లేకపోతే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని ఇదివరకే అనేక పరిశోధనల్లో తేలింది. అయితే, నిద్ర కొంచెం చెదిరినా.. మన మూడ్స్‌పై చాలా ఎఫెక్టే పడుతుందని తాజాగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్, మోంటానా స్టేట్ యూనివర్సిటీ సైంటిస్టుల రీసెర్చ్ లో వెల్లడైంది. రోజూ రాత్రిపూట నిద్ర తక్కువైనా, లేదంటే నిద్ర కొంచెం డిస్టర్బ్ అయినా.. పగటిపూట పరిస్థితులకు మనం రియాక్ట్ అయ్యే తీరు మారిపోతుందని వారు చెప్తున్నారు.
రీసెర్చ్ లో భాగంగా గత 50 ఏండ్లలో 5,715 మందిపై జరిగిన 154 స్టడీలను తాము విశ్లేషించామని మోంటానా వర్సిటీ సైంటిస్ట్ కారా పాల్మర్ వెల్లడించారు. గతంలో జరిగిన స్టడీల్లో వాలంటీర్లకు కావాలనే నిద్రలో ఆటంకాలు కలిగించి, దానివల్ల పడే ఎఫెక్ట్ పై పరిశోధనలు చేశారని తెలిపారు. ‘‘ఇండస్ట్రీల్లో పని చేసే ఉద్యోగులు, పైలట్లు, డ్రైవర్లు, నైట్ షిఫ్టుల్లో పని చేసే ఇతర ఉద్యోగులకు ఎక్కువగా నిద్రలేమి సమస్య వస్తుంటుంది.
దీనిపై ఇదివరకే ఎన్నో పరిశోధనలు జరిగాయి. అయితే, ప్రత్యేకంగా నిద్రలేమికి, భావోద్వేగాలకు ఉన్న సంబంధంపైనే మేం ఫోకస్ పెట్టాం. దీంతో నిద్రకు ఆటంకం ఏర్పడిన వాళ్లలో మూడ్స్ మారిపోవడమే కాకుండా హార్ట్ రేట్ పెరగడం, యాంగ్జైటీ, ఎక్కువగా చింతించడం వంటి సమస్యలు వస్తున్నాయని మా రీసెర్చ్‌లో తేలింది” అని కారా పేర్కొన్నారు.
అయితే, ఈ స్టడీలన్నీ ప్రధానంగా యూఎస్, యూరప్ ప్రాంతాల్లో యావరేజ్‌గా 23 ఏండ్ల వయసున్న వారిపైనే జరిగాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలు, కల్చర్, ఏజ్ లను బట్టి నిద్రలేమి సమస్య ప్రభావం వేర్వేరుగా ఉండొచ్చని.. దీనిపై విస్తృత పరిశోధనలు జరిగితేనే సమగ్ర వివరాలు తెలుస్తాయన్నారు. వీరి రీసెర్చ్ వివరాలు ఇటీవల ‘సైకలాజికల్ బులెటిన్’ జర్నల్ లో పబ్లిష్ అయ్యాయి.