
US Deporting Mails: అమెరికా యూనివర్సిటీల్లో చదివేందుకు వెళ్లాలనే ఆలోచనను ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ప్రస్తుతం వెనక్కి తీసుకుంటున్నారు. ట్రంప్ అధ్యక్షుడైన నాటి నుంచి మారుతున్న పరిస్థితులను గమనిస్తున్న చాలా మంది తమ నిర్ణయాలను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది కెనడా, యూకే వంటి ఇతర దేశాలకు వెళ్లే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.
ఇదే క్రమంలో అమెరికాలోని వందలాది మంది విదేశీ విద్యార్థులకు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నుంచి మెయిల్స్ వస్తున్నాయి. యూనివర్సిటీల్లో యాక్టివిస్టులుగా వారు చేస్తున్న కార్యకలాపాలను కారణంగా చూపుతూ స్వీయ బహిష్కరణతో దేశాన్ని వీడాలని సదరు మెయిల్స్ సారాంశం. ఈ క్రమంలో కొందరు భారతీయ విద్యార్థులకు సైతం ఇలాంటి మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. కొందరు భారతీయ విద్యార్థులు కొన్ని సోషల్ మీడియా పోస్టులను షేర్ చేసినందుకు ఈ తరహా మెయిల్స్ అందుకున్న వెల్లడైంది.
ALSO READ | ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. డబ్ల్యూటీఓకు నిధులు కట్
క్యాంపస్ యాక్టివిటీల్లో నేరుగా పాల్గొన్న విదేశీ విద్యార్థులకు మాత్రమే కాకుండా.. 'జాతి వ్యతిరేక' పోస్ట్‌లను తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేసినా లేదా లైక్ చేసిన వారు కూడా ప్రస్తుతం మెయిల్స్ అందుకుంటున్న వారిలో ఉన్నట్లు ఇమ్మిగ్రేషన్ న్యాయవాది ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం సోషల్ మీడియా పర్యవేక్షణలో అకడమిక్ స్టడీ వీసా, వొకేషనల్ స్టడీ వీసా, ఎక్స్ఛేంజ్ వీసాలపై ఉన్న విద్యార్థులు కూడా ఉన్నారని వెల్లడైంది.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న మెుత్త 11 లక్షల మంది విదేశీ విద్యార్థుల్లో 3 లక్షల 31 వేల మంది భారతీయు విద్యార్థులేనని 2023-24 గణాంకాలు చెబుతున్నాయి. ఒక్కసారి విద్యార్థులకు అందిన మెయిల్ లో ఏమని ఉందో గమనిస్తే.. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ తరపున, బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ వీసా ఆఫీస్ మీ వీసా జారీ తర్వాత అదనపు సమాచారం పొందిందని పేర్కొనబడింది. దీనివల్ల గడువు తేదీనికి ముందే మీకు జారీ చేసిన F-1 వీసాను యునైటెడ్ స్టేట్స్ ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టంలోని సెక్షన్ 221(i) ప్రకారం రద్దు చేయబడిందంటూ వెల్లడించింది.
దీని తర్వాత అమెరికాలో నివసిస్తే చట్టప్రకారం అది డిటెన్షన్, డిపోర్టేషన్ లేదా ఫైన్ కి దారితీస్తుంది. అలాగే విద్యార్థులు ఎంబసీ వద్ద తమ వీసాను అందించటంతో దానిని భౌతికంగా క్యాన్సిల్ చేస్తారు. దీని తర్వాత భవిష్యత్తులో మళ్లీ అమెరికా వెళ్లాలనుకుంటే అందుకోసం కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది.