36 హౌతీ స్థావరాలు నేలమట్టం

వాషింగ్టన్:  ఇరాన్ మద్దతుతో ఎర్ర సముద్రంలో వాణిజ్యనౌకలపై దాడులు చేస్తున్న హౌతీ రెబెల్స్ పై అమెరికా సంకీర్ణ సేనలు విరుచుకుపడ్డాయి. యెమెన్ లోని 13 ప్రాంతాల్లో హౌతీలకు చెందిన 36 స్థావరాలను నేలమట్టం చేశాయి. అమెరికాతోపాటు బ్రిటన్, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, డెన్మార్క్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ దేశాల సేనలు శనివారం ఈ మేరకు జాయింట్ స్ట్రైక్స్ చేశాయని అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. ఫైటర్ జెట్లతోపాటు యుద్ధనౌకల నుంచి మిసైల్స్ ప్రయోగించి టార్గెట్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.

అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై దాడులను ఆపకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని ఈ దాడులతో హౌతీ రెబెల్స్ కు తాము స్పష్టమైన సందేశం పంపామని ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి ముఖ్యమైన జలమార్గంలో నౌకలపై దాడులను అరికట్టడం, నావికుల ప్రాణాలను కాపాడటం కోసం తాము ఏ చర్యకైనా వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. కాగా, గత ఆదివారం జోర్డాన్ లోని అమెరికా మిలిటరీ బేస్ పై డ్రోన్ దాడికి ప్రతీకారంగా శుక్రవారం సిరియా, ఇరాక్ లోని 85 టార్గెట్లపై కూడా అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ చేసింది.