ఉక్రెయిన్​కు యూఎస్​ మిలిటరీ సాయం కట్​: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం

ఉక్రెయిన్​కు యూఎస్​ మిలిటరీ సాయం కట్​: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం
  • రష్యాకు లొంగిపోవాలనే సాయం ఆపారని ఉక్రెయిన్ ఆరోపణ
  • శాంతి దిశగా మంచి నిర్ణయం:రష్యా 

కీవ్/వాషింగ్టన్/మాస్కో: రష్యాతో యుద్ధంలో పోరాడటం కోసం ఉక్రెయిన్​కు అందిస్తున్న మిలిటరీ సాయాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్టు మంగళవారం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉక్రెయిన్ శాంతి చర్చలకు వచ్చేలా ఒత్తిడి పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు. శుక్రవారం వైట్ హౌస్ లో మినరల్స్ డీల్, రష్యాతో శాంతి చర్చల అంశంపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ, ట్రంప్ కు మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్​పై మరింత ప్రెజర్ పెంచేలా మిలిటరీ సాయాన్ని నిలిపివేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. 

అయితే, గత అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో మిలిటరీ సాయంలో భాగంగా ఉక్రెయిన్ కు ఇదివరకే డెలివరీ చేసిన వెపన్స్, ఎక్విప్ మెంట్లను కూడా వెనక్కి ఇవ్వాలని కోరతారా? లేదా? అన్నదానిపై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే, శాంతి చర్చల్లో రష్యా డిమాండ్లను ఉక్రెయిన్ ఒప్పుకోవాలని ఒత్తిడి పెంచేందుకే మిలిటరీ సాయాన్ని ట్రంప్ నిలిపివేశారని ఉక్రెయిన్ పార్లమెంట్ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఒలెగ్జాండర్ మెరెజ్కో అన్నారు. 

ఇది ఉక్రెయిన్ లొంగుబాటు దిశగా తీసుకున్న ప్రమాదకర నిర్ణయమని స్పష్టం చేశారు. ‘‘రష్యా డిమాండ్లను ఒప్పుకుని, ఉక్రెయిన్ లొంగిపోవాలనే ఆలోచనతోనే ట్రంప్ మిలటరీ సాయాన్ని నిలిపివేసినట్టుంది” అని అన్నారు. ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ ష్మైగల్ మంగళవారం కీవ్ లో మీడియాతో మాట్లాడుతూ.. అమెరికాతో మినరల్స్ డీల్ పై ఏ క్షణమైనా సంతకం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే, తమ భద్రత కోసం తగిన హామీలు కావాలన్నారు. 

రష్యాతో శాంతి ఒప్పందంలో భద్రతాపరమైన గ్యారంటీలు ఇవ్వడమే ఉక్రెయిన్ తోపాటు యూరోపియన్ యూనియన్ దేశాలకు, యూరప్ ఖండం మనుగడకు అత్యంత కీలకమన్నారు. కాగా, ఉక్రెయిన్ కు అమెరికా మిలిటరీ సాయాన్ని నిలిపివేయడం పట్ల రష్యా హర్షం వ్యక్తంచేసింది. శాంతి ప్రక్రియ దిశగా ఇది ఆశాజనకమైన నిర్ణయమని కామెంట్ చేసింది.