
న్యూఢిల్లీ: సుమారు అన్ని దేశాలపై యూఎస్ ప్రభుత్వం సుంకాలు వేయగా, ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాపై వీటి ప్రభావం తక్కువగా ఉంటుందని ఎన్ఎస్ఈ మేనేజింగ్ డైరెక్టర్ అశిష్ కుమార్ చౌహాన్ ఆదివారం పేర్కొన్నారు. సుంకాలపై యూఎస్‌తో వివిధ దేశాలు చర్చలు జరపనున్నాయని, రానున్న ఒకటి రెండు వారాల్లో పూర్తి క్లారిటీ వస్తుందని అన్నారు. యూఎస్ టారిఫ్ ప్రకటన తర్వాత ఇతర దేశాల స్టాక్ మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లు మెరుగ్గా కదిలాయని తెలిపారు.
"ప్రస్తుతం గందరగోళ పరిస్థితి కొనసాగుతోంది. కొన్ని కంపెనీలు ఎక్కువ నష్టాలను ఎదుర్కోవచ్చని చాలా మంది భావిస్తున్నారు. కానీ మొత్తంగా, చర్చలు జరుగుతాయి. సుంకాలపై రాబోయే ఒకటి లేదా రెండు వారాల్లో క్లారిటీ వస్తుంది" అని ఆయన చెప్పారు. కాగా, బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ కిందటి వారం 2.5 శాతం క్షీణించాయి. యూఎస్ మార్కెట్లయితే గత రెండు సెషన్లలోనే 10 శాతానికి పైగా పడ్డాయి.