
మిల్ వాకీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపి, ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ టీనేజీ యువకుడు కుట్రపన్నాడు. ట్రంప్‌ను హత్య చేసేందుకు డబ్బులు ఇవ్వాలని తన తల్లిదండ్రులను అడిగాడు. ఇవ్వకపోవడంతో వారిని కాల్చి చంపాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న విస్కాన్ సిన్ స్టేట్‌లోని మిల్వాకీలో ఈ ఘటన జరిగింది. నిందితుడిని నికిటా క్యాసప్గా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హత్య, దొంగతనం, మృతదేహాలను దాచిపెట్టడంతో పాటు పలు నేరాల కింద ఫెడరల్ పోలీసులు అతనిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు చూసి పోలీసులు షాకయ్యారు. తల్లి తాతియానా క్యాసప్ (35), సవతి తండ్రి డొనాల్డ్ మేయర్ (51) ను చంపిన తర్వాత నికిటా కొన్ని వారాల పాటు ఇంట్లోనే ఉన్నాడు. తర్వాత 14 వేల డాలర్ల నగదు, పాస్ పోర్టులు, పెంపుడు శునకంతో పారిపోయాడు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్యల విషయం వెలుగులోకి వచ్చింది.
గత నెల మార్చిలో కాన్సస్‌లో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని వచ్చే నెలలో మరోసారి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ‘‘తన పేరెంట్స్‌ను హత్యచేసి డ్రోన్, పేలుడు పదార్థాలు కొనుగోలు చేయాలని నికిటా ప్లాన్ చేసుకున్నాడు. రష్యా భాష మాట్లాడే ఓ వ్యక్తికి తన ప్లాన్ గురించి చెప్పాడు. అడాల్ఫ్ హిట్లర్‌ను పొగుడుతూ, యూదులకు వ్యతిరేకంగా మూడు పేజీల్లో తన ఉద్దేశాలను అతను రాసుకున్నాడు. అలాగే, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ను సైతం చంపాలనుకున్నాడు. అంతేకాకుండా ప్రభుత్వాన్ని కూల్చివేయాలని ప్లాన్ చేసుకున్నాడు. పేరెంట్స్ ఉంటే తన ప్లాన్‌కు అడ్డుపడతారని, డబ్బు సాయం చేయరని వారిని చంపేశాడు. దీంతో ఆర్థికంగా తనకు కావాల్సిన డబ్బును సమకూర్చుకున్నాడు” అని ఫెడరల్ అధికారులు వెల్లడించారు.
పేరెంట్స్‌ను హత్య చేసిన తర్వాత ఉక్రెయిన్‌కు పారిపోయేందుకు అతను ప్రయత్నించాడని, కాన్సస్‌లో నిందితుడిని పట్టుకున్నామని తెలిపారు. కాగా.. అంతకుముందు కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూటర్లు వాదిస్తూ ట్రంప్ హత్యకు నికిటా కుట్రపన్నాడని, హత్య అనంతరం ఉక్రెయిన్ లో నివసించేందుకు ప్లాన్ చేసుకున్నాడని చెప్పారు. అలాగే, నిందితుడి తల్లిదండ్రుల మృతదేహాలు బాగా కుళ్లిపోయాయని, డెంటల్ రికార్డుల ఆధారంగా వాటిని గుర్తించాల్సి వచ్చిందని చెప్పారు. నికిటాపై వచ్చిన ఆరోణలను అతని లాయర్ నికోల్ ఒస్త్రోవ్ స్కీ ఖండించారు. అతను టీనేజీ యువకుడని, ఇంకా హైస్కూల్లోనే ఉన్నాడని ఆమె వాదించారు.