ప్రపంచ దేశాలకు అమెరికా వార్నింగ్.. తిరిగి టారిఫ్ వద్దు: నోరు మూసుకుని కూర్చోండి..!

ప్రపంచ దేశాలకు అమెరికా వార్నింగ్.. తిరిగి టారిఫ్ వద్దు: నోరు మూసుకుని కూర్చోండి..!

US Tariffs Warning: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ ప్రకటించిన టారిఫ్స్ వల్ల దాదాపు 180 దేశాలు ప్రభావితం అయ్యాయి. ఈ క్రమంలో వారం చివరి నాటికి చాలా దేశాలపై యూఎస్ కొత్త సుంకాలు అమలులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలు, వ్యాపారాలపై టారిఫ్స్ ప్రభావం ఎంత మేరకు ఉంటుందో భేరీజు వేసుకునే పనిలో ఉన్నాయి. 

ఈ క్రమంలో యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్ వాణిజ్య భాగస్వాములకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అమెరికా విధించిన కొత్త సుంకాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించొద్దని, అలా చేయటంతో రేట్లు మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో వెనక్కి తగ్గి మనసు మార్చుకోవాలని, ప్రతీకార ధోరణిని ప్రదర్శించొద్దని ప్రపంచ దేశాలకు సలహా ఇచ్చారు. ప్రతీకారంగా అమెరికాపై సుంకాలకు దిగితే ఉద్రిక్తతలు మరింగా పెరుగుతాయని సూచించారు. 

ALSO READ | Trump 26% Tariff: కలిసొచ్చిన ట్రంప్ టారిఫ్స్.. ఇండియాలో ఆ 2 రంగాలకు గెయిన్..

ట్రంప్ లిబరేషన్ డే సందర్భంగా ప్రకటించిన టారిఫ్స్ లో ప్రజలు నివసించని దీవులను సైతం వదిలిపెట్టకపోవటం గమనార్హం. మిత్రదేశమైనా లేక శత్రుదేశమైనా ఒకటే నీతిని ప్రదర్శించారు. చైనా, ఈయూ వంటి ప్రధాన వ్యాపార భాగస్వాములపై కూడా కఠినంగానే ట్రంప్ వ్యవహరించారు. విదేశాల్లో తయారైన కార్లు, తేలికపాటి ట్రక్కులపై 25 శాతం ప్రత్యేక సుంకాలు కూడా అమల్లోకి తీసుకురాగా.. మే 3 నాటికి ఆటో విడిభాగాలపై కూడా పన్నులను విధించనున్నారు. ఈ సుంకాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని చైనా హెచ్చరించినప్పటికీ ట్రంప్ వెనక్కి తగ్గలేదు. 

ఇండియా ఏం చేస్తోంది..?
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాల వల్ల ఏర్పడే వాణిజ్య చిక్కులను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ విషయంలో దేశీయ కంపెనీలు, ఎగుమతిదారుల నుంచి అభిప్రాయాలను సేకరించే పనిలో ఉంది. ఇదే క్రమంలో ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు తక్కువ పన్నుల వల్ల ఎలాంటి కొత్త వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవచ్చనే అంశాలను అధ్యయనం చేస్తోంది. 

ట్రంప్ చూపిన మీడియా ఛార్టులో 26 శాతం సుంకాలను ఇండియాపై చూపగా.. భారతీయ వస్తువులపై 27 శాతం సుంకాన్ని చూపించే అనుబంధ పత్రాన్ని మంత్రిత్వ శాఖ గమనిస్తోంది. ఏప్రిల్ 5 నుంచి భారతదేశం 10 శాతం బేస్‌లైన్ సుంకాన్ని ఎదుర్కోవాల్సి ఉండగా.. మిగిలిన దేశ-నిర్దిష్ట అదనపు లెవీ 27 శాతం ఏప్రిల్ 9 నుంచి అమలులోకి రానున్నట్లు ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనబడింది. ప్రస్తుతం భారత టాప్ ఎగుమతిదారులు 30 శాతం అమెరికా మార్కెట్లపై ఆధారపడి ఉన్నారు. ఈ క్రమంలో ఇండియా పరిస్థితులను వ్యూహాత్మకంగా ముందుకు నడవాల్సి ఉంటుంది.

చైనా సీరియస్..
మరోపక్క డ్రాగన్ దేశం చైనా మాత్రం అమెరికా తమపై ప్రకటించిన సుంకాలను వెంటనే ఎత్తివేయాలని కోరుతోంది. వీటిపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికాను హెచ్చరించింది. చైనా మెుదటి నుంచి అమెరికా వాణిజ్య యుద్ధ వైఖరిని తప్పుపడుతోంది. ఈ క్రమంలో ప్రపంచ వాణిజ్య సంస్థ తలుపుకూడా తట్టింది. నేడు ట్రంప్ చైనాపై 34 శాతం సుంకాలను ప్రకటించటం డ్రాగన్ దేశం జీర్ణించుకోలేకపోతోంది.