
న్యూఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటన ఖరారైంది. తన భార్య ఉషా వాన్స్‌తో కలిసి వచ్చే వారం ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు జేడీ వాన్స్ కార్యాలయం బుధవారం (ఏప్రిల్ 16) ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 24 వరకు ఇటలీ, భారత్‌లో వాన్స్ పర్యటించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ పర్యటనలో భాగంగా వాన్స్ ఆర్థిక, భౌగోళిక రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. భారత ప్రధాని మోడీతో వాన్స్ భేటీ కానున్నారు. న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలో పర్యటించి పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కాగా, పలు దేశాలపై ట్రంప్ ప్రకటించిన టారిఫ్ వార్ వ్యవహారం ప్రపంచదేశాల్లో హాట్ టాపిక్ గా ఉన్న వేళ జేడీ వాన్స్ భారత్‌కు రానుండటంతో ఈ పర్యటనకు ప్రాధ్యానత సంతరించుకుంది.
కాగా, జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ భారత సంతతికి చెందిన మహిళ అన్నది తెలిసిన విషయమే. అమెరికా రెండో పౌరురాలిగా ఉషా భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఆమె తల్లిదండ్రులు క్రిష్, లక్ష్మి చిలుకురి 1970లో భారత్ నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. క్రిష్ చిలుకురి శాన్ డియాగో స్టేట్ యూనివర్శిటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఉషా తల్లి లక్ష్మీ చిలుకురి మాలిక్యులర్ బయాలజీ విభాగంలో టీచింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
దీంతో పాటు శాన్ డియాగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సిక్స్త్ కాలేజీకి ప్రోవోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక.. ఉషా, జెడి వాన్స్ యేల్ లా స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒకరికొకరు పరిచమయ్యారు. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ న్యాయవాది అయిన ఉషా వాన్స్ యూఎస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ జి రాబర్ట్స్ దగ్గర క్లర్క్‌గా పనిచేశారు. ఆమె భర్త జేడీ వాన్స్ రాజకీయాల్లోకి వచ్చి.. అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికమయ్యాడు.