ప్రధాని మోదీతో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భేటీ

ప్రధాని మోదీతో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భేటీ

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్  ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.  కుటుంబ సమేతంగా  మోదీ నివాసంలో భేటీ అయ్యారు జేడీ వాన్స్. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో మోదీ పర్యటన సందర్భంగా ప్రకటించిన ‘ఇండియా–అమెరికా టెక్నాలజీ పార్ట్ నర్ షిప్  ట్రస్ట్’ను ఇద్దరు నేతలు ప్రారంభిస్తారు. అమెరికా, ఇండియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ, వాన్స్ సమీక్షిస్తారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లను ఎడాపెడా విధిస్తున్న సమయంలో మోదీ, వాన్స్ సమావేశంపై ఆసక్తి నెలకొంది.

ఏప్రిల్ 21న  ఢిల్లీకి వచ్చిన జేడీ వాన్స్ కుటుంబానికి  ఢిల్లీలోని పాలం విమానాశ్రయం దగ్గర కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఘన స్వాగతం పలికారు. భారతీయ సాంప్రదాయ నృత్యాలతో కళాకారులు జేడీ వాన్స్ దంపతులను ఆహ్వానించారు. ఏప్రిల్  24 వరకూ జేడీ వాన్స్ దంపతులు భారత్లో పర్యటించనున్నారు. తాజ్ మహల్ తో పాటు భారత్లోని పలు చారిత్రక ప్రదేశాలను జేడీ వాన్స్ కుటుంబం సందర్శించనుంది. 

జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ భారత సంతతికి చెందిన మహిళ కావడం గమనార్హం. అమెరికా రెండో పౌరురాలిగా ఉషా భారత్‎లో పర్యటించడం ఇదే తొలిసారి. ఆమె తల్లిదండ్రులు క్రిష్, లక్ష్మి చిలుకురి 1970లో భారత్ నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. క్రిష్ చిలుకురి శాన్ డియాగో స్టేట్ యూనివర్శిటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఉషా తల్లి లక్ష్మీ చిలుకురి మాలిక్యులర్ బయాలజీ విభాగంలో టీచింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.