అమెరికా సందర్శన హక్కు కాదు.. కొందరికి ఇచ్చే ప్రత్యేక అధికారమన్న విదేశాంగ మంత్రి

అమెరికా సందర్శన హక్కు కాదు.. కొందరికి ఇచ్చే ప్రత్యేక అధికారమన్న విదేశాంగ మంత్రి
  • అమెరికా ప్రయోజనాలు, భద్రతే ముఖ్యమని స్పష్టం చేసిన రూబియో

వాషింగ్టన్​డీసీ: అమెరికా వీసా పొందడం అనేది హక్కు కాదని.. దేశానికి సానుకూలంగా సహకరించే వారికి ఇచ్చే ప్రత్యేక అధికారమని ఆ దేశ విదేశాంగమంత్రి మార్కో రుబియో అన్నారు. అమెరికా భద్రత విషయంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధానం సరైందేనని స్పష్టం చేశారు. తమ దేశాన్ని సందర్శించడాన్ని కొందరు హక్కుగా భావిస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు.

అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధానాలకు వ్యతిరేకంగా పనిచేసే వారి వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించాడు. ప్రత్యేకించి, పాలస్తీనా ఉద్యమాల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేయడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. అప్లికెంట్ బ్యాక్ గ్రౌండ్ పూర్తిగా చెక్ చేసిన తర్వాతే వీసా మంజూరు చేస్తామన్నారు. వీసా విషయంలో మాత్రం నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. పాలస్తీనా ఉద్యమాలకు మద్దతు పలకడం అంటే.. అమెరికన్లను బెదిరించడమే అవుతుందన్నారు. చదువుకోవడానికి వచ్చినప్పుడు దానిపైనే దృష్టిపెట్టాలని సూచించారు. 

అమెరికా వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొంటే..
అమెరికాకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లీగల్​గా మళ్లీ అమెరికాకు వచ్చే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోతారన్నారు. పని చేసే ఆఫీసుల్లో నిరసనకు దిగినా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేకంగా టెక్నాలజీ సెక్టార్​లో పని చేసే వలసదారులందరికీ ఇది వర్తిస్తుందని తెలిపారు. హమాస్​పై దాడిని వ్యతిరేకిస్తూ హెచ్​1బీ వీసాదారులు కూడా బహిరంగంగా నిరసనకు దిగారని గుర్తు చేశారు.

హెచ్​1బీ వీసా, ఎఫ్​1 వీసా, గ్రీన్ కార్డ్ హోల్డర్లందరూ ఇక్కడి చట్టాలకు అనుగుణంగా పని చేయాల్సిందే అని తేల్చి చెప్పారు. కొందరు నిరసనకారులు.. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్​ప్రెషన్ పేరుతో టెర్రరిస్టులకు సహకరిస్తున్నారన్నారు. ఇక్కడి చట్టాలు ఉల్లంఘించిన, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకు మద్దతు పలికిన వారికి మొదటి సవరణ వర్తించదని సుప్రీం కోర్టు కొన్ని దశాబ్దాల కిందే స్పష్టం చేసిందని గుర్తు చేశారు.