
పారిస్: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం విషయంలో రానున్న కొద్ది రోజుల్లో ఎలాంటి పురోగతి లేకుంటే, తమ దారి తాము చూసుకుంటామని అమెరికా హెచ్చరించింది. ఇక శాంతి ఒప్పంద ప్రయత్నాలను విరమించుకుంటామని తేల్చి చెప్పింది. శుక్రవారం పారిస్‌లో అమెరికా, ఉక్రెయిన్, యూరోపియన్ నేతలు సమావేశమయ్యారు. ఈ మీటింగ్ అనంతరం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం సాధ్యమా..? కాదా..? అనేది నిర్ణయించే సమయం వచ్చిందని అన్నారు. రానున్న కొద్ది రోజుల్లో శాంతి ఒప్పందం కుదురుతుందా..? లేదా..? అనేది నిర్ణయించాల్సి ఉందన్నారు. ‘‘మేం శాంతి ఒప్పందం కోసం వారాలు, నెలల తరబడి ప్రయత్నాలు చేస్తూ ఉండలేం. ఇక ఇది ఎన్ని రోజుల్లో పూర్తవుతుందనేది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది.
రెండు దేశాల్లో శాంతి నెలకొల్పాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తితో ఉన్నారు. ఇందుకోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇందులో ఎలాంటి పురోగతి లేకపోతే, ఇక ప్రయత్నాలు మానుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఎందుకంటే ఇంకా వేరే ప్రాధాన్య అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు.
కొనసాగుతున్న చర్చలు..
రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే సౌదీ అరేబియాలో పలు రౌండ్ల చర్చలు జరిగాయి. ఇప్పుడు ఫ్రాన్స్‌లో జరుగుతున్నాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మూడుసార్లు సమావేశమయ్యారు. కానీ ఒప్పందం దిశగా ఇప్పటి వరకు ముందడుగు పడలేదు. కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా తయారు చేసిన ఫ్రేమ్‌వర్క్‌ను ఉక్రెయిన్ ఆమోదించినప్పటికీ, రష్యా తిరస్కరించింది. ఓవైపు చర్చలు జరుపుతూనే ఉక్రెయిన్‌పై దాడులకు పాల్పడుతున్నది.