WHOకు గుడ్ బై.. వర్క్ ఫ్రం హోం రద్దు.. అమెరికాలో పుడితే పౌరసత్వం ఇవ్వరు : ట్రంప్ సంచలన నిర్ణయాలు

WHOకు గుడ్ బై.. వర్క్ ఫ్రం హోం రద్దు.. అమెరికాలో పుడితే పౌరసత్వం ఇవ్వరు : ట్రంప్ సంచలన నిర్ణయాలు

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే.. ట్రంప్ చకచకా పనులు చేసేస్తున్నారు. చెప్పింది చెప్పినట్లు.. చేస్తానన్నది చేసి చూపించేస్తున్నారు. ఫస్ట్ డే తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. ట్రంప్ చేసిన సంతకాలు చూస్తే.. మిగతా దేశాలకు గుండె దడ మొదలైంది. ఐటీ ఉద్యోగులపైనా తనదైన స్టయిల్ లో సంచలన నిర్ణయాలు తీసుకుని.. షాక్ ఇచ్చారనే చెప్పాలి. 

ట్రంప్ మార్పు ఇలా : 
>>> ప్రపంచ ఆరోగ్య సంస్థకు గుడ్ బై చెప్పారు. WHOతో తెగతెంపులు చేసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో రాజకీయ జోక్యం ఎక్కువైందని.. చైనాకు అధికంగా నిధులు ఖర్చు చేస్తున్నారని.. ఇది అమెరికాకు అన్యాయం అంటూ.. ఏకంగా ఆ సంస్థ నుంచి బయటకు వస్తున్నట్లు సంతకం చేశారు ట్రంప్.
>>> అమెరికాలోని కొన్ని సంస్థల్లో కరోనా సమయం నుంచి కొనసాగుతున్న వర్క్ ఫ్రం హోం విధానాన్ని రద్దు చేశారు. ఫెడరల్ ఉద్యోగులు అందరూ ఆఫీసులకు వచ్చి పని చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని పూర్తి రద్దు చేస్తూ సంతకం చేశారు.
>>> గ్లోబల్ వార్మింగ్.. పారిస్ వాతావరణ ఒప్పందం. భూ మండలంపై 2 డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గిస్తూ ప్రపంచ దేశాలు చేసుకున్న ఒప్పందం. ఈ ఒప్పందం నుంచి అమెరికా బయటకు వచ్చేస్తూ.. ట్రంప్ సంతకం చేశారు. ఏ దేశానికి ఆ దేశం స్వీయ నియంత్రణ చేసుకోవాలని సూచించారు. 
>>> అమెరికాలో పుట్టే అందరికీ పుట్టుకతో వచ్చే అమెరికా పౌరసత్వం విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీయులు అమెరికా గడ్డపై బిడ్డను జన్మిస్తే.. ఆ పుట్టిన బిడ్డకు అమెరికా గ్రీన్ కార్డు.. అమెరికా పౌరసత్వం ఇవ్వటం ఇప్పటి వరకు జరుగుతుంది. ఇక నుంచి అలా జరగదు. విదేశీయులు.. అంటే ఐటీ ఉద్యోగులు ఎవరైనా అమెరికా వెళ్లి అక్కడ పిల్లలకు జన్మనిస్తే.. వాళ్లకు ఇక నుంచి అమెరికా పౌరసత్వం ఇవ్వరు. 
>>> టిక్ టాక్ నిషేధంపై 75 రోజుల బ్రేక్ ఇచ్చారు. టిక్ టాక్ లో వాటా కొనుగోలు, నియంత్రణ వంటి వాటిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు ట్రంప్.
>>> క్యూబాను ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశంగా గుర్తిస్తూ బ్లాక్ లిస్టులో పెట్టటాన్ని తప్పుబట్టిన ట్రంప్.. ఆ బ్లాక్ లిస్టు నుంచి క్యూబా దేశాన్ని తొలగిస్తూ సంతకం చేశారు ట్రంప్.
>>> ట్రాన్స్ జెండర్స్, మగాళ్లు మగాళ్లు పెళ్లి చేసుకోవటం.. ఆడోళ్లు ఆడోళ్లు పెళ్లి చేసుకోవటం.. వాళ్లకు హక్కులు ఇవ్వటం వంటి అన్నింటిపైనా నిషేధం విధించారు. ఇక నుంచి అమెరికాలో రెండు జెండర్స్ మాత్రమే ఉంటాయి.. ఒకటి మగ, మరొకటి ఆడ.. ఈ రెండు మాత్రమే ఉంటాయి.. మిగతా అన్నింటినీ రద్దు చేశారు. 
>>> 2020 ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయిన తర్వాత.. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ట్రంప్ మద్దతుదారులు అమెరికా కాపిటల్ పై దాడి చేశారు. ఈ దాడి చేసిన 15 వందల మందికి విముక్తి కల్పిస్తూ.. సంతకాలు చేశారు ట్రంప్.

47వ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే.. ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయాలు.. అమలు దిశగా చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఏదిఏమైనా ట్రంప్ చెప్పాడంటే చేస్తాడంతే.. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఆషామాషీగా ఏమీ లేవు.. ప్రపంచ దేశాలను సైతం ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రభావం మిగతా దేశాలపై ఎలా పడుతుందో చూడాలి.