
- అరుదైన సమస్యతో బాధపడుతున్న అమెరికన్ మహిళ
- మూడేండ్లుగా అంతుపట్టక డాక్టర్లు సైతం షాక్
- చివరకు గర్భాశయం రెండుగా చీలి ఉన్నట్టు గుర్తింపు
- ఆపరేషన్ కు సిద్ధమవుతున్న బాధితురాలు
వాషింగ్టన్: సాధారణంగా మహిళలకు 21 రోజుల నుంచి 35 రోజులకోసారి పీరియడ్స్ వస్తాయి. 2 నుంచి 7 రోజులదాకా రుతుస్రావ చక్రం కొనసాగుతుంది. వయసు, హార్మోన్ లెవెల్స్, ఒత్తిడి, డైట్, వ్యాయామం వంటి జీవనశైలి వల్ల ఆ సైకిల్ మార్పు చెందుతుంది. కానీ, అమెరికాలో పాపీ అనే మహిళకు వెయ్యి రోజులుగా రుతుస్రావం అవుతూనే ఉంది. డాక్టర్లకు సైతం ఆమె పరిస్థితి అంతుబట్టలేదు. దీంతో అత్యంత అరుదైన ఘటనగా పాపీ పరిస్థితిని గుర్తించారు. టిక్ టాక్ లో పాపీ తన హెల్త్ జర్నీ గురించి వివరించింది. గత మూడేండ్లకుపైగా తనకు రుతుస్రావం అవుతోందని తెలిపింది.
‘‘ఇప్పటికే ఎన్నో టెస్టులు చేయించుకున్నాను. ట్రీట్ మెంట్లు తీసుకున్నా. సర్జికల్ ప్రొసీజర్లు కూడా జరిగాయి. ఎవరూ కూడా నా సమస్యకు కారణం కనుగొనలేకపోయారు. నాకెందుకు నాన్ స్టాప్ గా బ్లీడింగ్ అవుతున్నదో ఎవరికీ తెలియదు” అని పాపీ ఒక వీడియోలో పేర్కొంది. ఆమెకు పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్, ఇర్రెగులర్ పీరియడ్లు, నొప్పితో కూడిన క్రాంప్స్ రావడం వంటి సమస్య) ఉన్నట్లు డాక్టర్లు మొదట అనుమానించారు.
అయితే, ఆమెకు ఓవేరియన్ సిస్ట్స్ (అండాశయాల్లో గడ్డలు ఏర్పడడం) ఉన్నట్లు గుర్తించారు. ఓవేరియన్ సిస్టులతో నిరంతర బ్లీడింగ్ అవడం లేదని కనుగొన్నారు. దీంతో ఆమెకు హిస్టరోస్కోపీ (యుటెరస్ లోపల ఏముందో తెలుసుకునే ప్రక్రియ) చేశారు. బ్లీడింగ్ ను నియంత్రించేందుకు ఇంట్రాయుటిరైన్ డివైజ్ అమర్చినా ఫలితం లేదు. చివరకు ఆమె బైకార్నుయేట్ యుటెరస్ తో బాధపడుతున్నట్లు డయాగ్నోస్ చేశారు.
బైకార్ నేట్ యుటిరస్ అంటే గర్భాశయం హృదయంలాగా ఏర్పడి రెండు చాంబర్లుగా విడిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఐదు శాతం మందికి ఈ సమస్య వస్తుందని క్లీవ్ ల్యాండ్ క్లినిక్ తెలిపింది. ‘‘అసలు తమకు ఆ సమస్య ఉన్నట్లు మహిళలకే తెలియదు. దీంతో సంతాన సమస్యలు రావడం, అదేపనిగా మిస్ క్యారేజ్, బ్లీడింగ్ కావడం వంటివి జరుగుతాయి” అని డాక్టర్లు చెప్పారు. ఇక తన సమస్యకు కారణం తెలిసిందని, హార్మోనల్ టెస్టు చేయించుకుంటానని, అలాగే తనలో అమర్చిన ఇంట్రా యుటిరైన్ డివైజ్ ను తీయించేసుకుంటానని పాపీ తెలిపింది.