అమెరికాలోని టెన్నెస్సీలో ఉండే టామి మానిస్ అనే ఆవిడ తన తల వెనక జుట్టును 1990 నుంచి ఇప్పటివరకు కత్తిరించుకోలేదు. అంటే దాదాపు 33 ఏండ్లు జుట్టు మీద కత్తెర పెట్టలేదన్నమాట. దాంతో ఆ జుట్టు 172.72 సెంటీమీటర్లు అంటే ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు పెరిగింది. 58 ఏండ్ల మానిస్1980లో జుట్టు పెంచుకోవాలని అనుకుంది. అదికూడా ఒక వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి. ఆమె చూసిన వీడియోలో ఆ సింగర్‌కు ర్యాట్టెయిల్ (ఎలుక తోకలాంటి) హెయిర్ స్టయిల్ ఉందట. ‘‘అలాంటి హెయిర్ స్టయిల్ నాక్కూడా కావాలి అనిపించింది. దాంతో 1989లో ఒక బార్బర్ ర్యాట్టెయిల్ హెయిర్‌కట్ చేసుకోమని నన్ను ఎలాగోలా ఒప్పించాడు.
కానీ ఆ హెయిర్‌స్టయిల్ చేయించుకున్నాక నాకు చాలా బాధనిపించింది. దాంతో జుట్టు మళ్లీ పెంచుకోవాలి అనే గట్టి నిర్ణయం తీసుకున్నా. అలా చూసుకుంటే1990 ఫిబ్రవరి 9వ తేదీ నాజుట్టు అఫీషియల్ బర్త్‌డే. అప్పటినుంచి నా జుట్టు పెంచుతూనే ఉన్నా. అదికూడా ముల్లెట్(మడవ చేప) హెయిర్ స్టయిల్. అది ఇప్పుడు నాకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చి పెట్టింది. నన్ను గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కించింది. ప్రపంచంలోనే పొడవైన ముల్లెట్ హెయిర్ స్టయిల్ నాది. నా జుట్టు ఇంత పొడవు ఉంటుందనే విషయం ఎదురుగా ఉన్న వాళ్లకు తెలియదు. వాళ్లు నా వెనక్కి వచ్చి చూస్తే కానీ నా అందమైన ముల్లెట్ హెయిర్ స్టయిల్ గురించి తెలియదు” అంటూ నవ్వుతూ చెప్పింది.