పోర్ట్ ఓ ప్రిన్స్: కరీబియన్ కంట్రీ హైతీలో అమెరికాకు చెందిన ఓ యూట్యూబర్ కిడ్నాప్‌కు గురయ్యాడు. అక్కడి గ్యాంగ్‌స్టర్‌ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన యూట్యూబర్‌ను మరో గ్యాంగ్ సభ్యులు ఎత్తుకెళ్లారు. ఏకంగా 6 లక్షల డాలర్లు ఇస్తే కానీ వదిలిపెట్టేది లేదని అంటున్నారు. పలు అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాల ప్రకారం.. అమెరికాలోని జార్జియాకు చెందిన అడిసన్ పిర్రే మాలౌఫ్ ఓ యూట్యూబ్ చానల్ రన్ చేస్తున్నాడు. యువర్ ఫెల్లో అరబ్ పేరుతో ఉన్న ఈ చానల్ కు 14 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. పర్యాటకులు వెళ్లడానికి భయపడే ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రదేశాలను తన సబ్ స్క్రైబర్లకు చూపిస్తుంటాడు.
ఈ క్రమంలోనే హైతీలో కరుడు గట్టిన గ్యాంగ్ స్టర్ జిమ్మి బార్బెక్యూ చెరిజియర్ ను ఇంటర్వ్యూ చేయడానికి ఆ దేశానికి వెళ్లాడు. ఓ పెద్ద హోటల్లో దిగి స్థానికుడు ఒకరిని తనకు సాయం చేయడానికి మాట్లాడుకున్నాడు. ఆ హోటల్‌ను వీడియో తీసి అమెరికాలోని తన యూట్యూబ్ చానల్ ఎడిటర్‌కు పంపించాడు. అంత పెద్ద హోటల్లో ప్రస్తుతం తానొక్కడినే ఉన్నానని, గ్యాంగ్ స్టర్ల భయంతో హైతీకి పర్యాటకులు ఎవరూ రావడంలేదని అందులో చెప్పుకొచ్చాడు. మరుసటి రోజు తెల్లవారుజామున హైతీ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్‌కు వెళుతున్నానని, ఒకవేళ తాను చనిపోతే నా యూట్యూబ్ చానల్ లో పెట్టిన వీడియోలు చూసినందుకు మీకందరికీ ధన్యవాదాలని, తిరిగొస్తే మాత్రం ఆ క్రెడిట్ మొత్తం దేవుడిదేనని కామెంట్ చేశాడు.