- పాక్‌ను ఓడించి సంచలనం
- జట్టులో చాలా మంది ఇండియన్సే
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్) టీ20 వరల్డ్ కప్‌లో ఆతిథ్య దేశంగా తొలిసారి బరిలోకి దిగిన జట్టు అమెరికా. క్రికెట్‌కు కొత్త. ఆతిథ్య జట్టుగా తప్పిస్తే దానిపై పెద్దగా అంచనాలు లేవు. కానీ, రెండు మ్యాచ్‌లు ఆడేసరికి అంతా తన గురించి మాట్లాడేలా చేసింది. తొలి పోరులో మరో చిరు జట్టు కెనడాను ఓడించిన యూఎస్‌ఏ తాజాగా మాజీ చాంపియన్, గత ఎడిషన్ రన్నరప్ పాకిస్తాన్‌కు షాకిచ్చివరల్డ్ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచింది. గురువారం అర్ధరాత్రి వరకు జరిగిన పోరులో సూపర్ ఓవర్లో పాక్ పని పట్టిన యూఎస్ టీమ్‌లో చాలా మట్టుకు ఇండియన్సే ఉన్నారు. ఉద్యోగం, చదువు, కెరీర్ కోసం యూఎస్‌కు వెళ్లి ఆ టీమ్‌లో కీలకంగా మారిన క్రికెటర్లు పాక్‌పై సూపర్ విక్టరీతో ఫేమస్ అయిపోయారు. అమెరికా టీమ్‌లో మెరికల్లాంటి మనోళ్ల జర్నీని చూస్తే..
కెప్టెన్ మొనాంక్ ఫ్రమ్ అహ్మదాబాద్
అహ్మదాబాద్‌లో పుట్టిన మొనాంక్ పటేల్ యూఎస్ టీమ్‌కు కెప్టెన్‌గా ఎదిగాడు. పాక్‌తో మ్యాచ్‌లో ఫిఫ్టీ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన మొనాంక్ తన క్రికెట్ కెరీర్ కోసం దేశం మారిన అరుదైన ఆటగాళ్లలో ఒకడు. 2010లో అతనికి యూఎస్ గ్రీన్ కార్డ్ లభించగా.. 2016లో న్యూజెర్సీలో పర్మనెంట్‌గా సెటిలయ్యాడు. కొన్నాళ్లు రెస్టారెంట్ నడిపిన అతను తర్వాత క్రికెట్‌పైనే ఫోకస్ పెట్టాడు. హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ అయిన మొనాంక్ మ్యాచ్‌లు లేని టైమ్‌లో వారానికి మూడు రోజులు కోచింగ్ క్లినిక్స్ నిర్వహిస్తూ ఇండియా సంతతి చిన్నారులకు క్రికెట్ పాఠాలు చెబుతాడు. మొదట్లో అమెరికాలో టర్ఫ్ వికెట్లు చాలా తక్కువగా ఉండటంతో దేశ వ్యాప్తంగా మ్యాట్‌పై జరిగే 20, 30 ఓవర్ల వీకెండ్ క్లబ్ క్రికెట్ టోర్నీల్లో ఆడేవాడు.
టెకీ సౌరభ్..సూపర్ పేసర్
సూపర్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ముంబైకర్ సౌరభ్ కుమార్ నేత్రవల్కర్ అంతకుముందు ఖతర్నాక్ ఔట్ స్వింగర్‌తో మహ్మద్ రిజ్వాన్‌ను, స్లో ఫుల్ టాస్‌తో ఇఫ్తికార్ అహ్మద్‌ను బోల్తా కొట్టించి ఔరా అనిపించాడు. కంప్యూటర్ ఇంజనీర్ అయిన సౌరభ్ ఉద్యోగానికి సెలవు పెట్టి ఈ టోర్నీలో ఆడుతున్నాడు. అతని ప్రయాణం చాలా ఆసక్తికరం. క్రికెట్‌తో పాటు చదువులోనూ చురుకైన సౌరభ్ 2010లో ఇండియా తరఫున అండర్19 వరల్డ్ కప్‌లో పాల్గొన్నాడు. ఆశించిన అవకాశాలు లేక ఎంఎస్ కోసం యూఎస్ వెళ్లాడు. ‘క్రిక్‌డికోడ్’ అనే ప్లేయర్-ఎనాలిస్ యాప్‌ను రూపొందించిన అతనికి ఓరాకిల్ సంస్థ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. దాంతో తను శాన్ ఫ్రాన్సిస్కోలో సెటిల్ అయ్యాడు. మంచి ఉద్యోగమే చేస్తున్నా అతనికి ఏదో వెలితిగా అనిపించేది. దాంతో అటు జాబ్ చేస్తూ క్రికెట్ ఫీల్డ్‌లోకి వచ్చిన సౌరభ్.. ఇండియాకు చెందిన వారితో వీకెండ్స్‌లో క్రికెట్ టోర్నీల నుంచి యూఎస్‌కు చెందిన పలు లెవెల్స్ టోర్నీల్లో బరిలోకి దిగి అదరగొట్టాడు. మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ తొలి ఎడిషన్‌లో తన మార్కు చూపెట్టాడు. ఈ క్రమంలో యూఎస్ నేషనల్ టీమ్‌లో చోటు దక్కించుకున్న సౌరభ్ టీ20 వరల్డ్ కప్‌లో తనదైన ముద్ర వేస్తున్నాడు.
సక్సెస్ కోసం యూఎస్‌కు హర్మీత్
స్పిన్ ఆల్‌రౌండర్ అయిన హర్మీత్ సింగ్ 2012 అండర్19 వరల్డ్ కప్‌లో ఇండియా టీమ్ తరఫున సూపర్ పెర్ఫామెన్స్ చేశాడు. కానీ, చాలా మంది టాలెంటెడ్ ప్లేయర్ల మాదిరిగానే హర్మీత్ దారి తప్పాడు. ఓ కేసులో అరెస్ట్ అవ్వడం, క్రమశిక్షణ లేదన్న కారణాలతో ఈ ముంబైకర్ క్రికెట్ లైఫ్ తలకిందులైంది. ముంబై నుంచి త్రిపురకు మారినా, ఐపీఎల్ ఆడినా సక్సెస్ కాలేకపోయాడు. అయితే, యూఎస్‌ఏకు షిఫ్ట్ అవ్వాలన్న నిర్ణయం తన జీవితాన్ని మార్చింది. గతేడాది యూఎస్ తరఫున టీ20 అరంగేట్రం చేసిన అతను నిలకడగా రాణిస్తూ వరల్డ్ కప్‌కు ఎంపికయ్యాడు. సూపర్ ఓవర్లో కీలక రన్స్ రాబట్టి అమెరికా సూపర్ విక్టరీలో భాగం అయ్యాడు.
బయో–మెడికల్ ఆఫీసర్ నోస్తుష్ కెంజిగె
అలబామలో సెటిలైన తమిళ కుటుంబంలో పుట్టిన స్పిన్నర్ నోస్తుష్ కెంజిగె ఊటీలో క్రికెట్‌ను నేర్చుకున్నాడు. 18 ఏండ్ల వయసులో బెంగళూరు కేఏసీఏ ఫస్ట్ డివిజన్ లీగ్‌లో పోటీ పడ్డాడు. కర్నాటక స్టేట్ టీమ్‌లో కూడా తనకు ప్లేస్ కష్టమని భావించిన అతను బయో–మెడికల్ ఇంజనీరింగ్ చదివేందుకు తిరిగి అమెరికా వెళ్లిపోయాడు. వాషింగ్టన్ డీసీలో ఉద్యోగం సంపాదించిన నోతుష్ సాయంత్రాల్లో క్లబ్ క్రికెట్ ఆడసాగాడు. చివరకు బయో–మెడికల్ ఆఫీసర్ జాబ్ వదిలేసి యూఎస్‌ఏకు ఆడుతూ ఈ స్థాయికి ఎదిగాడు.
వీళ్లు కూడా
పాక్‌తో మ్యాచ్‌లో ఆఖరి బాల్‌కు ఫోర్‌తో ఆటను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లిన నితీశ్ కుమార్ ఇండియా సంతతి ఆటగాడే. తొలుత కెనడాకు, ఇప్పుడు యూఎస్‌కు ఆడుతున్నాడు. ఢిల్లీకి చెందిన మిలింద్ కుమార్ క్రికెట్ కోసం యూఎస్‌కు వెళ్లగా.. పంజాబ్ సంతతి ప్లేయర్ జస్‌ప్రీత్ సింగ్ ఆ టీమ్ ప్రధాన పేసర్‌గా మారాడు. బాబర్ ఆజమ్‌ను ఔట్ చేసిన డెలివరీ అతని కెరీర్‌లో బెస్ట్ అనొచ్చు.