- అనారోగ్యం నేపథ్యంలో అమెరికా సర్కారు మంజూరు
- అయినా సరే.. స్వదేశానికి రప్పిస్తాం: -పోలీసులు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్ కార్డు మంజూరు అయ్యింది. అమెరికాలో ఇప్పటికే గ్రీన్ కార్డు ఉన్న తన కుమారుడి అభ్యర్థన మేరకు బ్లడ్ రిలేషన్ కేటగిరీలో, అనారోగ్యం నేపథ్యంలో ప్రభాకర్‌కు అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు శుక్రవారం సమాచారం అందింది.
అనారోగ్యం కారణంగా ప్రభాకర్ రావు అమెరికాలో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదుకు ముందే ఆయన అమెరికా టూర్ ప్లాన్ చేసుకున్నారు. అప్పటికే ఆయన కుమారుడు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ప్రారంభించాడని అధికారులు అనుమానిస్తున్నారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే ప్రభాకర్ కు గ్రీన్ కార్డు వచ్చినట్లు తెలిసింది.
అయితే.. గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ కేసు దర్యాప్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. స్థానిక చట్టాలకు లోబడి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును ఇండియాకు రప్పించే ప్రక్రియ వేగవంతం చేశామని వెల్లడించారు.