USA vs PAK: వీళ్ళకి ఆర్మీ శిక్షణ దండగే.. ఫీల్డింగ్ తప్పిదాలతో మ్యాచ్ చేజార్చుకున్న పాకిస్థాన్

USA vs PAK: వీళ్ళకి ఆర్మీ శిక్షణ దండగే.. ఫీల్డింగ్ తప్పిదాలతో మ్యాచ్ చేజార్చుకున్న పాకిస్థాన్

అంతర్జాతీయ క్రికెట్ లో ఫీల్డింగ్ ఎంత ముఖ్యం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఫీల్డింగ్ లోపాలు అనేవి ఎప్పుడో ఒకసారి జరుగుతుంటాయి. అయితే పాకిస్థాన్ కి మాత్రం ఈ సమస్య ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. తాజాగా వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాతో జరిగిన లీగ్ మ్యాచ్ లో పాక్  ఫీల్డింగ్ విన్యాసాలు చూస్తే అస్సలు నవ్వాగదు. వీరి ఫీల్డింగ్ గల్లీ క్రికెట్ కంటే దారుణంగా ఉండడం గమనార్హం. మ్యాచ్ లో చెత్త ఫీల్డింగ్ చేసి మూల్యం చెల్లించుకున్న ఆ జట్టు..కీలకమైన సూపర్ ఓవర్ లో అంతకు మించే దారుణమైన ఫీల్డింగ్ తో మ్యాచ్ చేజార్చుకున్నారు. 

సింగిల్ రావాల్సిన దగ్గర అమెరికా ఆటగాళ్లు సరదాగా రెండు పరుగులు రాబట్టారు. దీనికి తోడు వైడ్ ల రూపంలో అదనపు పరుగులు ఆ జట్టును దెబ్బ తీశాయి. అమెరికా చేసిన మొత్తం 18 పరుగుల్లో 8 ఎక్స్ట్రాల రూపంలో రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీంతో పాక్ ఫిట్ నెస్ పై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆసియా కప్, వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఇదే నాసిరకమైన ఫీల్డింగ్ తో మూల్యం చెల్లించుకుంది. టీ20 వరల్డ్ కప్ కు ఆటగాళ్ల ఫిట్ నెస్ పై పాక్ క్రికెట్ బోర్డు ప్రత్యేక శ్రద్ద తీసుకుంది. 

ఆర్మీ స్కూల్ లో వారికి శిక్షణ ఇప్పించి వరల్డ్ కప్ కు వారిని సిద్ధం చేశారు. బాబర్ అజామ్ నేతృత్వంలోని జట్టు కాకుల్‌లోని ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్‌లో శిక్షణ పొంది వరల్డ్ కప్ బరిలోకి దిగారు. అయితే ఇంత చేసినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. మా తీరు ఇంతే అన్నట్టుగా ఫీల్డింగ్ లో ఎప్పటిలాగే తమ మార్క్ చూపించారు. వీరికి ఆర్మీ దగ్గర శిక్షణ కూడా దండగే అని నెటిజన్స్ పాక్ ఆటగాళ్లపై మండిపడుతున్నారు. 

బ్యాటింగ్, బౌలింగ్ లోపాల కారణంగా మ్యాచ్ ఓడిపోవడం చూసాం కానీ పాక్ మాత్రం పేలవ ఫీల్డింగ్ తో మ్యాచ్ ను చేజార్చుకుంటుంది. టోర్నీలో పాక్ ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉంది. సూపర్ 8 కే అర్హత సాధించాలంటే ప్రతి మ్యాచ్ కీలకమే. దీంతో వారు ఫీల్డింగ్ లో మెరుగు పడకపోతే కనీసం సూపర్ 8 దశకు చేరకుండా ఇంటిదారి పట్టినా ఆశ్చర్యం లేదు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో అమెరికా కూడా 159 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్ లో అమెరికా 18 పరుగులు చేస్తే.. పాక్ 13 పరుగులకే పరిమితమైంది. దీంతో అమెరికా 5 పరుగుల సంచలన విజయం సాధించింది.