T20 World Cup 2024: అమెరికా డబుల్ ధమాకా.. 2026 టీ20 వరల్డ్ కప్‌కు అర్హత

T20 World Cup 2024: అమెరికా డబుల్ ధమాకా.. 2026 టీ20 వరల్డ్ కప్‌కు అర్హత

క్రికెట్ లో అమెరికా పెద్దగా రాణించింది లేదు. పసికూన జట్టుగా ఆ జట్టు పనికిరాదు. అదృష్టవశాత్తు వరల్డ్ కప్ కు అర్హత సాధించింది. అయితే ఇవన్నీ వరల్డ్ కప్ ముందు వరకు వినిపిస్తున్న మాటలు. ప్రస్తుతం అమెరికా జట్టు క్రికెట్ లో తన సత్తా చూపిస్తుంది. సమిష్టిగా మెరుగైన క్రికెట్ ఆడుతూ తన ఉనికిని చాటుకుంటుంది. వరల్డ్ కప్ కు ఆతిధ్యమిచ్చి అందరి దృష్టిలో పడిన ఈ జట్టు.. తాజాగా టీ20 వరల్డ్ కప్ 2024లో సూపర్ 8 కు చేరుకోని ఆ సంతోషాన్ని డబుల్ చేసుకుంది. 2026 టీ20 వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధించింది.

2026 టీ20 వరల్డ్ కప్ కు భారత్, శ్రీలంక జట్లు ఆతిధ్యమివ్వనున్నాయి. మొత్తం 20 జట్లు ఈ మెగా లీగ్ ఆడతాయి. ఈ టోర్నీకి ఆతిధ్య దేశాలుగా భారత్, శ్రీలంక నేరుగా అర్హత సాధిస్తాయి. దీంతో పాటు ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8కు అర్హత సాధించిన జట్లన్నీ 2026 టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధిస్తాయి.  దీని ప్రకారం అమెరికా 2026 టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధించింది. మిగిలిన జట్లు క్వాలిఫయర్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. గ్రూప్ ఏ లో భారత్ తో పాటు అమెరికా సూపర్ 8 కు చేరుకుంది. కెనడా, పాకిస్థాన్ పై గెలిచిన అమెరికా.. భారత్ చేతిలో ఓడిపోయింది.

గ్రూప్‌–ఎలో భాగంగా శుక్రవారం రాత్రి అమెరికా, ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దాంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో 5 పాయింట్లతో  అమెరికా సూపర్‌‌–8 రౌండ్‌కు అర్హత సాధించింది. ఇదే గ్రూప్ లో భారత్ ఇప్పటికే సూపర్ 8 లోకి అడుగుపెట్టింది.