- వర్షంతో యూఎస్‌ఏ, ఐర్లాండ్ మ్యాచ్ రద్దు
లాడర్‌హిల్ : టీ20 వరల్డ్ కప్‌లో తొలి ప్రయత్నంలోనే ఆతిథ్య అమెరికా జట్టు సూపర్–8 రౌండ్‌కు క్వాలిఫై అయింది. మాజీ చాంపియన్, గత సీజన్ రన్నరప్ పాకిస్తాన్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. గ్రూప్–ఎలో భాగంగా శుక్రవారం రాత్రి అమెరికా, ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దాంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో 5 పాయింట్లతో అమెరికా సూపర్–8 రౌండ్‌కు అర్హత సాధించింది.
ఈ గ్రూప్ నుంచి హ్యాట్రిక్ విక్టరీలతో ఇండియా ఇప్పటికే ముందంజ వేసింది. దాంతో పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే ఇంటిదారి పట్టాయి. మూడేసి మ్యాచ్‌ల్లో ఒక్కటే గెలిచి రెండింటిలో ఓడిన పాకిస్తాన్, కెనడా రెండు పాయింట్లతో నిలిచాయి. ఈ రెండు జట్లు తమ చివరి మ్యాచ్‌లో గెలిచినా నాలుగు పాయింట్లకే చేరుకుంటాయి. ఐర్లాండ్ మూడు మ్యాచ్‌ల్లో ఓకే పాయింట్‌తో ఆఖరి ప్లేస్‌లో నిలిచింది.