2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 పోరుకు సమయం ఆసన్నమైంది. బుధవారం(జూన్ 19) తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, అమెరికా జట్లు తలపడనున్నాయి. ఐసీసీ ర్యాంకులు, జట్టు బలాబలాలను బట్టి దక్షిణాఫ్రికా ఫేవరెట్ అనడంలో సందేహం లేనప్పటికీ.. సంచలన ప్రదర్శనతో ముందంజ వేసిన అమెరికాను తక్కువ అంచనా వేయలేం.
బౌలర్లే సౌతాఫ్రికా బలం
దక్షిణాఫ్రికా సూపర్-8కు అర్హత సాధించిందన్న పేరు తప్ప.. ఇప్పటివరకూ వారు స్థాయికి తగ్గ ఆట ఆడలేదు. నెదర్లాండ్‌పై పోరాడి గెలవగా.. నేపాల్, బంగ్లాదేశ్ జట్లపై ఆఖరి బంతికి గట్టెక్కారు. 113/6 (20 ఓవర్లలో), 115/7 (20 ఓవర్లలో).. వరుసగా బంగ్లాదేశ్, నేపాల్ జట్లపై వారి ప్రదర్శన ఇది. చిన్నజట్లపైనా.. బంతికో పరుగు చొప్పున కూడా చేయలేకపోయారు. డేవిడ్ మిల్లర్ మినహా ఏ ఒక్కరూ రాణించడం లేదు. డికాక్, హెన్డ్రిక్స్, మర్క్ రమ్, క్లాసెన్ దారుణంగా విఫలమవుతున్నారు.
ప్రోటీస్ జట్టు బ్యాటర్లు తడబడుతున్నప్పటికీ.. బౌలర్లు మాత్రం రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్నారు. గంటకు 145కి. మీ. వేగంతో బంతులేసే కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, ఒట్నీల్ బార్ట్‌మన్‌లను ఎదుర్కోవడం అమెరికన్లకు అంత తేలికైన విషయం కాదు. అందునా, స్పిన్‌కు అనుకూలించే వెస్టిండీస్ పిచ్‌లపై కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ మరింత ప్రమాదకరం.
ఆ ఇద్దరిపైనే అమెరికన్ల భారం
గాయం కారణంగా భారత్‌తో మ్యాచ్‌కు దూరమైన మోనాంక్ పటేల్ తిరిగి జట్టులో చేరే అవకాశం ఉంది. మోనాంక్‌తో పాటు ఆరోన్ జోన్స్, కోరీ ఆండర్సన్‌లు రాణించడంపైనే అమెరికా బ్యాటింగ్ ఆధారపడి ఉంది. ఇక సూపర్ ఫామ్‌లో ఉన్న పేసర్లు సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్.. ఆదిలోనే సఫారీ బ్యాటర్లను కట్టడిచేస్తే అగ్రదేశం పైచేయి సాధించినట్టే.
- వేదిక: సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, ఆంటిగ్వా
దక్షిణాఫ్రికా జట్టు(అంచనా): క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, ఒట్నీల్ బార్ట్‌మన్, తబ్రైజ్ షమ్సీ.
అమెరికా జట్టు(అంచనా): మోనాంక్ పటేల్ (కెప్టెన్), స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్, నితీష్ కుమార్, కోరీ ఆండర్సన్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, జస్దీప్ సింగ్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్.