ముంబై: చెలామణిలోని రూ.రెండు వేల నోట్ల విలువ ఏడాది క్రితం 8.2 శాతం నుంచి ఫిబ్రవరి 9తో ముగిసిన వారానికి 3.7 శాతానికి తగ్గిందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటించింది. గత మే 19న, ఆర్బీఐ రూ. 2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 31 నాటికి, రూ.2,000 నోట్లలో దాదాపు 97.5 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి.
దాదాపు రూ.8,897 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయి. నోట్ల ఉపసంహరణ ప్రకటించినప్పుడు చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లు. ఇప్పటికీ నోట్లను కలిగి ఉన్న వ్యక్తులు, సంస్థలు వాటిని సెప్టెంబరు 30, 2023లోగా మార్చుకోవాలని లేదా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయాలని కోరారు.ఆ తర్వాత గడువును గత అక్టోబర్ వరకు పొడిగించారు.