
- విదేశీ శక్తులతో కాంగ్రెస్ చేతులు కలిపిందని బీజేపీ ఫైర్
- విచారణ చేపట్టి, నిజాలు తేల్చాలని కాంగ్రెస్ డిమాండ్
- ఇండియాకు యూఎస్ ఎయిడ్ నిధులు ‘కిక్ బ్యాక్ స్కీమ్’ అంటూ ట్రంప్ కామెంట్
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ఇండియాలో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా అందజేసిన నిధులపై రాజకీయ దుమారం రేగుతున్నది. ఈ నిధులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకో ఆరోపణ చేస్తుండడంతో మన దేశంలో పొలిటికల్ హీట్ పెరుగుతున్నది. ఇండియాలో మరెవరినో గెలిపించేందుకు గత బైడెన్ సర్కార్ ప్రయత్నం చేసిందని, అందుకే భారత్ లో ఓటింగ్ శాతం పెంచేందుకు యూఎస్ ఎయిడ్ ద్వారా 21 మిలియన్ డాలర్లు (రూ.182 కోట్లు) కేటాయించిందని ఇంతకుముందు ట్రంప్ ఆరోపించారు. ఇప్పుడు ఆయన మరో బాంబు పేల్చారు. ఇదొక ‘కిక్ బ్యాక్ స్కీమ్’ అని ఆరోపించారు.
గురువారం వాషింగ్టన్ డీసీలో జరిగిన రిపబ్లికన్ గవర్నర్ల అసోసియేషన్ మీటింగ్ ను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ‘‘ఇండియాలో ఓటింగ్ శాతం పెంచేందుకు మనమెందుకు నిధులు ఇవ్వాలి? మన సమస్యలు మనకు లేవా? అయినా మనమిచ్చే డబ్బంతా ఇండియాకే వెళ్తున్నదా? ఆ డబ్బులు అందిన తర్వాత వాళ్లేం ఆలోచిస్తారో తెలుసా? ఇదొక కిక్ బ్యాక్ స్కీమ్. నిధులు తీసుకుంటారు.. ఖర్చు చేస్తారు. ఆ నిధులు ఇచ్చిన వారికి తిరిగి లబ్ధి చేకూరేలా పని చేస్తారు” అని అన్నారు.
మరోవైపు 2008 నుంచి ఇండియాలో ఎలక్షన్ రిలేటెడ్ ప్రాజెక్టులకు యూఎస్ ఎయిడ్ ఎలాంటి ఫండ్స్ కేటాయించలేదని నేషనల్ మీడియాలో రిపోర్టు పబ్లిష్ అయింది. బైడెన్ హయాంలో కేటాయించిన ఫండ్స్ ఇండియా కోసం కాదని, బంగ్లాదేశ్ లో ఓటింగ్ శాతం పెంచేందుకు ‘అమర్ ఓట్ అమర్’ అనే ప్రాజెక్టు కోసం 2022లో ఇచ్చారని ఆ రిపోర్టు పేర్కొంది. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నెలకొంది.
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..
ట్రంప్ కొద్ది రోజులుగా చేస్తున్న ఆరోపణలతో మన దేశంలో పొలిటికల్ హీట్ పెరిగింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ‘‘ఇండియాలో ఓటింగ్ శాతం పెంచేందుకు కేటాయించిన నిధులను కిక్ బ్యాక్ స్కీమ్ గా ట్రంప్ పేర్కొన్నారు. వాళ్ల కోసం పని చేస్తున్నోళ్ల కోసమే అమెరికా నుంచి ఆ నిధులు అందినట్టుగా అర్థమవుతున్నది” బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ అన్నారు. అయితే బీజేపీ నేతల కామెంట్లకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా కౌంటర్ ఇచ్చారు.
‘‘మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే యూఎస్ నుంచి నిధులు అందినట్టుగా బీజేపీ ప్రచారం చేస్తున్నది. ఆ డబ్బులను దేశంలోకి మోదీ ప్రభుత్వం ఎలా అనుమతించింది? 2012లో యూపీఏ హయాంలో అమెరికా నుంచి డబ్బులు అందాయని అంటున్నారు. అట్లయితే ఆ డబ్బులతోనే 2014లో బీజేపీ గెలిచిందా?” అని ప్రశ్నించారు.
విదేశాంగ శాఖ విచారణ..
యూఎస్ ఫండ్స్ వివాదంపై విదేశాంగ శాఖ స్పందించింది. యూఎస్ ఎయిడ్ నుంచి మన దేశంలోని ఎన్జీవోలు, సంస్థలకు అందిన నిధులపై విచారణ చేపట్టినట్టు తెలిపింది. ‘‘యూఎస్ ఎయిడ్ నుంచి ఇండియాకు అందిన నిధులపై అమెరికా వెల్లడించిన సమాచారాన్ని చూశాం. ఇది చాలా ఆందోళనకు గురిచేస్తున్నది.
ఇండియా అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యంపై అనుమానాలను రేకేత్తిస్తున్నది. దీనిపై ఇండియా దృష్టిసారించింది” అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. కాగా, అమెరికా నుంచి పనామాకు పంపిన అక్రమ వలసదారుల్లో ఇండియన్స్ ఉన్నారా? లేదా? అనేది తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు.