తెలుగులో తీర్పులు సాధ్యమే : డా. మంగారి రాజేందర్

కోర్టుల్లో ప్రాంతీయ భాషల వాడకం శూన్యం. సాక్షులు తెలుగులో సాక్ష్యం చెబుతారు. చీఫ్, క్రాస్​ఎగ్జామినేషన్స్​ దాదాపు తెలుగులోనే జరుగుతాయి. కానీ వాటిని ఇంగ్లీషులో నమోదు చేస్తారు. తీర్పులు కూడా ఇంగ్లీషులోనే ఉంటాయి. జిల్లా స్థాయి కోర్టుల్లో ప్రాంతీయ భాషల్లో తీర్పులు చెప్పడానికి వీలున్నప్పటికీ తెలుగులో తీర్పులు రావడం లేదు. నా లాంటి ఒకరిద్దరు న్యాయమూర్తులు తెలుగులో తీర్పులు చెప్పారు. ఆ స్ఫూర్తితో కొంత మంది న్యాయమూర్తులు కూడా తెలుగులో తీర్పులు వెలువరించారు. ఉమ్మడి ఏపీలో ఫిబ్రవరి 2013లో ‘తెలుగులో న్యాయపాలన’ అన్న పేరుతో హైదరాబాద్​లో ఓ రాష్ట్ర స్థాయి సదస్సును అధికార భాషా సంఘం, ఆంధ్రప్రదేశ్​జ్యుడీషియల్​అకాడమీ సంయుక్తంగా నిర్వహించాయి. తెలుగులో న్యాయపాలన జరగాలన్న ఉద్దేశాన్ని ఆ సదస్సు కలుగ జేసింది. ఆ సందర్భంగా ‘తెలుగు న్యాయపాలన’ అని నేను రాసిన పుస్తకాన్ని కూడా వెలువరించారు. అప్పుడు తెలుగులో న్యాయపాలన జరగాలన్న స్ఫూర్తి చాలా మంది న్యాయమూర్తుల్లో కలిగింది. కానీ తర్వాత ఆ స్ఫూర్తి పూర్తిగా కనుమరుగైంది. ఆ దిశగా హైకోర్టు గానీ, జ్యుడీషియల్ అకాడమీ గానీ, ప్రభుత్వం గానీ చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదు. అధికార భాషా సంఘం నామ మాత్రంగా ఉన్నట్టు అనిపిస్తున్నది. 

సుప్రీంలో హిందీ వాడకం ప్రతిపాదన

నిరుడు ఏప్రిల్​లో రాష్ట్రాల సీఎంలు, ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఢిల్లీలో జరిగింది. భారత ప్రధాని ఆ సదస్సులో ప్రారంభోపన్యాసం చేశారు. విచారణలో ఉన్న ఖైదీలు, పాతబడిన చట్టాలు, రాజ్యాంగ పరిరక్షణలో సుప్రీంకోర్టు, హైకోర్టుల పాత్ర గురించి ప్రధాని తన ఉపన్యాసంలో ప్రస్తావించారు. కోర్టుల్లో ప్రాంతీయ భాషల వినియోగం గురించి కూడా మాట్లాడారు. కొత్త చట్టాలు ప్రాంతీయ భాషల్లో రావాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. ప్రాంతీయ భాషల వాడకం వల్ల న్యాయవ్యవస్థ ప్రజలకు చేరువవుతుందని అన్నారు. 2017లో అప్పటి రాష్ట్రపతి కోవింద్​ కొచ్చీలో మాట్లాడుతూ తీర్పులు ప్రాంతీయ భాషల్లో కూడా వెలువరించాలని సూచించారు. హిందీ భాషను సుప్రీంకోర్టులో వాడకం గురించి లా కమిషన్​తన 2016వ నివేదికలో చర్చించింది. అందరు భాగస్వాములతో చర్చించి ఇప్పుడున్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో ఆ భాష వాడకం కష్టమని నివేదికలో పేర్కొంది. లా కమిషన్​అభిప్రాయాన్ని ప్రభుత్వం సమర్థించింది. అయితే హిందీ వాడకాన్ని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్​ హైకోర్టుల్లో ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం అధికారం ఇచ్చింది. తమ రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో కూడా ప్రాంతీయ భాషల వాడకానికి అనుమతి ఇవ్వాలని తమిళనాడు, గుజరాత్, చత్తీస్​గఢ్, కర్నాటక కోరుతున్నాయి. ఈ ప్రతిపాదనల మీద ప్రభుత్వం సీజేఐ అభిప్రాయాన్ని కోరింది. దీనిపై సుప్రీం ఫుల్ బెంచ్​చర్చించి ప్రభుత్వ నిర్ణయం ఆచరణీయం కాదని నిర్ణయించింది.

ప్రజలకు అర్థమయ్యే భాషలో..

హైకోర్టుల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు న్యాయమూర్తులుగా పనిచేస్తారు. కాబట్టి ఇది ఆచరణలో ఇబ్బందులు కలిగించవచ్చు. అయితే ఆ ప్రాంతీయ భాషలు తెలిసిన హైకోర్టు న్యాయమూర్తుల బెంచ్​ముందు ప్రాంతీయ భాషల్లో వాదనలు కొనసాగించే అవకాశాన్ని కల్పించాలి. దీని వల్ల ఎవరికీ ఇబ్బంది లేదు. వాదనలు ప్రాంతీయ భాషలో చెప్పినప్పటికీ తీర్పులను న్యాయమూర్తులు ఇంగ్లీషులో వెలువరించవచ్చు. ఎందుకంటే తీర్పులు అప్పీలులో సుప్రీంకోర్టుకు వెళ్తాయి. అది అవసరమే. తీర్పులు ఇంగ్లీషులో ఉండటం వల్ల అందులో ఏం రాశారన్న సంగతి ప్రజలకు అంత సులువుగా అర్థం కాదు. బార్ కౌన్సిల్​ఆఫ్​ మహారాష్ట్ర, గోవాలు ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​చంద్రచూడ్ కు సన్మానం చేసినప్పుడు.. ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ భాషల్లో తీర్పులను తర్జుమా చేసి అందించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. తీర్పులు ఇంగ్లీషులో ఉండటం వల్ల అవి గ్రామీణ లిటిగెంట్లకు అర్థమయ్యే పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు అర్థమయ్యే భాషలో మనం తీర్పులు చెప్పకపోతే, వారికి చేరువ కామని ఆయన అన్నారు.  

ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేయొచ్చు..

సీజేఐ ప్రతిపాదనను ప్రధాని ఓ ట్వీట్​లో అభినందించారు. సుప్రీం తీర్పులు ప్రాంతీయ భాషల్లో లభించడం వల్ల చాలా మందికి ఉపయోగం ఉంటుందని మోడీ తన ట్వీట్​లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ప్రాంతీయ భాషలను వాడలేం. దాని వల్ల చాలా సమస్యలు ఏర్పడుతాయి. హైకోర్టులో ప్రాంతీయ భాషలు వాడటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ సుప్రీం, హైకోర్టుల తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేయడం కష్టసాధ్యం కాదు. ఎలాంటి ఇబ్బందులూ లేవు. దీనికి కృత్రిమ మేధస్సు(ఏఐ) మాత్రమే సరిపోదు. వాటిని సరిచేసే మానవ మేధస్సు కూడా అవసరం. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గుర్తించాల్సిన అవసరం ఉంది.

జిల్లా కోర్టుల్లో వెలువరించవచ్చు

జిల్లా స్థాయి కోర్టుల్లో ప్రాంతీయ భాషల వాడకం అత్యవసరం. దానికి ఎలాంటి ఆటంకం కూడా లేదు. న్యాయ పరిపాలన ప్రజలకు చేరువ కావాలంటే ఆ పరిపాలన ప్రాంతీయ భాషల్లో(తెలుగులో)జరగాలి. తెలుగులో న్యాయపాలన జరగాలంటే తెలుగులో చట్టాలు ఉండాలి. నాలాంటి ఒకరిద్దరి కృషి ఇందుకు సరిపోదు. ఇది ప్రభుత్వం చేయాల్సిన పని.ఈ బాధ్యతను ప్రభుత్వం స్వీకరించి ఆ రంగంలో విశేష కృషి చేసిన వారి హెల్ప్​ తీసుకోవాలి. అంతవరకు న్యాయమూర్తులు ఆగాల్సిన అవసరం లేదు. వాళ్లు తీర్పులను తెలుగులో వెలువరించవచ్చు. తీర్పులు గానీ, చట్టాలు గానీ తెలుగులో ఉండటం ఎంత అవసరమో అవి సరళంగా ఉండటం మరింత అవసరం.

- డా. మంగారి రాజేందర్, కవి, రచయిత