వాడిన నూనెను  కూడా అమ్మొచ్చు.. ఎవరు కొంటారంటే..

వాడిన నూనెను  కూడా అమ్మొచ్చు.. ఎవరు కొంటారంటే..
  • బయో డీజిల్ తయారీలో వాడిన నూనె
  • రెస్టారెంట్స్, హోటల్స్​ నుంచి సేకరణ 
  • కిలోకు రూ. 45 ఇస్తున్న ఏజెన్సీలు  
  • ఏపీ, తమిళనాడుకు పంపి బయో డీజిల్ ​తయారీ 
  • ఇంతకుముందు బజ్జీల బండ్లు, ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లకు సరఫరా
  • కొత్త పద్ధతితో కల్తీ ఆహారానికి చెక్

హైదరాబాద్ సిటీ, వెలుగు:వెజ్, నాన్​వెజ్​కర్రీస్, ఫ్రైస్, మిర్చీలు, బజ్జీలు, గారెలు, పిండి వంటకాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ ఐటమ్ కు ఆయిల్​వాడవలసిందే. ఇంట్లో అయితే మనకు నచ్చిన బ్రాండ్​ఆయిల్​తెచ్చుకుని వండుకుని తృప్తిగా తింటాం. మరి రెస్టారెంట్లకు, హోటల్స్, బజ్జీల బండ్లు, ఫాస్ట్ ఫుడ్​సెంటర్లకు వెళ్తున్నప్పుడు వారు ఎలాంటి ఆయిల్​ వాడుతున్నారో మనకు తెలియదు. కొన్ని చోట్ల వాడిన ఆయిల్​నే మళ్లీ మళ్లీ వాడుతూ ఫుడ్​ఐటమ్స్​ప్రిపేర్​చేసి వడ్డిస్తుంటారు. 

ఫుడ్​సేఫ్టీ అధికారులు పలుచోట్ల జరిపిన తనిఖీల్లో ఇలా జరుగుతున్నట్టు గుర్తించారు కూడా. ఇలా వాడడం వల్ల గుండె సమస్యలతో పాటు క్యాన్సర్​వచ్చే ప్రమాదం ఉంటుంది. వీటన్నింటికీ చెక్​పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ ఎఫ్ఎస్ఎస్ఏఐ, జీహెచ్ఎంసీ ఆధ్యర్యంలోని ఫుడ్​సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా పెద్ద రెస్టారెంట్లలో వాడగా మిగిలిన నూనెను ఏజెన్సీల ద్వారా కలెక్ట్​చేయించి ఇతర రాష్ట్రాల్లో బయోడీజిల్​తయారీ కోసం పంపిస్తున్నారు. దీంతో వాడిన ఆయిల్​మళ్లీ వాడకుండా చేయడంతో పాటు బయోడీజిల్​ ఉత్పత్తి వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.   

60 వేలకు పైనే హోటళ్లు, రెస్టారెంట్లు

సిటీలో చిన్నాచితక హోటల్స్​నుంచి మొదలు పెడితే ఫైవ్​స్టార్​హోటళ్ల దాక చూస్తే సంఖ్య దాదాపు 60 వేలకు పైనే ఉంటుంది. వీటిల్లో రెండు వేలకుపైనే పెద్ద రెస్టారెంట్స్​ఉన్నాయి. ఇందులో రోజూ వందకు పైనే లీటర్ల వంటనూనె ఉపయోగిస్తుంటారు. వంద లీటర్ల ఆయిల్​ తో వంటకాలు చేస్తే సుమారు 25 లీటర్ల ఆయిల్​మిగులుతుందనేది ఒక అంచనా. అయితే కొందరు రెస్టారెంట్ల నిర్వాహకులు వాడిన ఆయిల్​ను స్ట్రీట్​ఫుడ్​ వెండర్లకు, బజ్జీల బండ్ల వారికి, ఫాస్ట్​ఫుడ్ ​సెంటర్ల కు, ప్రైవేట్ ఏజెన్సీలకు అమ్ముతుంటారు. ఇది ఇష్టం లేనివారు డ్రెయిన్లలో పారబోస్తుంటారు. దీనివల్ల అన్ని రకాలుగా నష్టాలే జరుగుతున్నాయి. మాటిమాటికి వాడిన ఆయిల్​ మూలంగా చేసే వంటకాలను తింటే రోగాలు రావడం, డ్రెయిన్లలో పారబోయడం వల్ల మురుగు  ప్రవాహానికి ఆటంకం కలగడం జరుగుతోంది. 

చెక్​పెట్టిన ఎఫ్ఎస్ఎస్ఏఐ

వాడిన నూనెతో ఏర్పడుతున్న సమస్యలకు చెక్​పెట్టడానికి ఫుడ్​సేఫ్టీ అండ్​స్టాండర్ట్స్​అథారిటీ ఆఫ్​ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా రోజూ 50 లీటర్లకు మించి వంట నూనెను ఉపయోగిస్తున్న రెస్టారెంట్లు తప్పనిసరిగా రుకో(రీ యూజ్డ్ కుకింగ్ ఆయిల్)లో రిజిస్ట్రేషన్​చేయించుకోవాలని రూల్​పెట్టింది. తర్వాత ఆ రెస్టారెంట్లు వాడిన ఆయిల్​ను తప్పనిసరిగా రుకో గుర్తింపు పొందిన ఏజెన్సీలకు అమ్మాలని సూచించింది.

ఏడాదిన్నరలో 210 టన్నులకు పైనే.. 

గ్రేటర్ లో రుకో(రీ యూజ్డ్ కుకింగ్ ఆయిల్) ద్వారా గుర్తింపు పొందిన ఏజెన్సీలతో ఆయిల్ సేకరణ చేయిస్తున్నారు. ఏడాదిన్నర నుంచి సిటీలోని 300పైగా రెస్టారెంట్లలో 210 టన్నులకు పైగా వాడిన ఆయిన్​ను సేకరించి ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోని బయో డీజిల్ తయారీ కేంద్రాలకు తరలిస్తున్నారు. రెస్టారెంట్ల నుంచి ఆయిల్​సేకరించే సమయంలో కిలోకు ఏజెన్సీలు రూ. 
40 నుంచి రూ.45 చెల్లిస్తున్నాయి. దీంతో రెస్టారెంట్ నిర్వాహకులకు వేస్ట్​ నూనెకు డబ్బులు రావడంతో పాటు, ఆ నూనెతో బయో డీజిల్​వచ్చి పర్యావరణానికి మేలు జరిగే అవకాశం ఉంటుంది.  అలాగే, స్ట్రీట్​ ఫుడ్ వెండర్లకు వాడేసిన ఆయిల్​అమ్మకం తగ్గడం వల్ల...ఆహార కల్తీకి కొద్దిమేర చెక్​ పడినట్టవుతుందని ఫుడ్ ​సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. 

అవేర్​నెస్​ తీసుకొస్తున్నాం

‘ఎఫ్ఎస్ఎస్ఏఐ రూల్స్​ప్రకారం 50 లీటర్ల వంట నూనె వాడే ప్రతీ రెస్టారెంట్​ప్రభుత్వం నుంచి రిజిష్టర్​అయిన ఏజెన్సీలకు ఆయిల్​అమ్మాలి. వాటిని బయోడీజిల్​తయారీకి వాడతారు. సిటీలో కొన్ని రెస్టారెంట్లు మాత్రమే మేం చెప్పిన పద్ధతి ఫాలో అవుతున్నాయ్​. దీనిపై చాలా రెస్టారెంట్స్​ నిర్వాహకులకు అవగాహన లేదు. వారిలో అవేర్​నెస్ ​తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఎల్బీనగర్ ​ఫుడ్​ సేఫ్టీ ఆఫీసర్​లక్ష్మీకాంత్, పటాన్​చెరు ఫుడ్​ సేఫ్టీ ఆఫీసర్​ భానుతేజ గౌడ్​ తెలిపారు. 

రోజూ 25 లీటర్లు ఇస్తున్నాం 

మా రెస్టారెంట్​లో డెయిలీ వంద లీటర్లకు పైనే ఆయిల్​ఉపయోగిస్తాం. ఇందులో 25 నుంచి 30 లీటర్ల వరకు వాడిన ఆయిల్ మిగులుతుంది. ఇంతకుముందు స్ట్రీట్​ఫుడ్​నిర్వాహకులు మా దగ్గరకు వచ్చి ఆ నూనె తీసుకెళ్లేవారు. మరికొందరు ప్రైవేట్​ఏజెన్సీలు కూడా తీసుకువెళ్లేవి. వాటిని దేనికి ఉపయోగించేవో తెలియదు. అవగాహన వచ్చాక మేము రూకోలో రిజిష్టర్​అయిన ఏజెన్సీకి మాత్రమే అమ్ముతున్నాం. దాని నుంచి బయో డీజిల్​తయారు చేస్తారని తెలిసింది. మంచిదే కదా..పైగా ఏజెన్సీ వారే మా దగ్గరకు వచ్చి కలెక్ట్​ చేసుకుంటారు. – శ్రీరామ్​, శ్రీకన్య పార్సిల్స్​ అండ్​ రెస్టారెంట్, పంజాగుట్ట