- నిరుపయోగంగా రూ. 13. 50 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్
- రూ. 6 కోట్లతో నిర్మించిన బస్టాండ్‌లో సౌలత్‌లు కరవు
గద్వాల, వెలుగు: ఎన్నికల ముందు అప్పటి బీఆర్ఎస్ సర్కారు గద్వాలలో హడావిడిగా ఇంటిగ్రేటేడ్ మార్కెట్, ఆర్టీసీ బస్టాండ్ నిర్మించి సౌలత్‌లు కల్పించడం మరిచిపోయింది. ఇంటిగ్రేటేడ్ మార్కెట్‌లో బిల్డింగ్‌లు ఖాళీగా ఉండటం, షాపులు తెరవకపోవడం, కరెంట్ లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. ఆరు కోట్లతో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్‌లో ఒక వైపు మాత్రమే రోడ్డు వేయడంతో బస్సుల రాకపోకలకు సమస్యలు వస్తున్నాయి. బస్టాండ్‌లో పార్కింగ్ లేకపోవడం, ప్రయాణికులకు మంచినీళ్లు కూడా దొరక్కపోవడం లాంటి సమస్యలు వేధిస్తున్నాయి.
వినియోగంలోకి రాలే
గద్వాల టౌన్‌లో కూరగాయల మార్కెట్ ఇరుకుగా ఉంది. దీంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను దాదాపు రూ. 13 కోట్ల 50 లక్షలతో నిర్మించారు. మార్కెట్ కోసం బయటికి వస్తే ఒకే చోట అన్ని కొనుగోలు చేసుకుని వెళ్లేలా దీన్ని నిర్మిస్తున్నామని అప్పటి ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. అక్కడే చికెన్, ఫిష్, మటన్, కిరాణం, వెజిటేబుల్ మార్కెట్ తదితర వాటి కోసం షెటర్లు నిర్మించారు. ఇందులో సపరేట్‌గా చికెన్, ఫిష్, మటన్ అమ్మకాల కోసం షాపులను ఏర్పాటు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ మరికొన్ని గంటల్లో వస్తుందనే ఉద్దేశంతో ముందుగానే స్థానిక ఎమ్మెల్యే హడావిడిగా గతేడాది అక్టోబర్ నెలలో ప్రారంభించారు.
కానీ ఇప్పటివరకు వినియోగంలోకి రాకపోవడంతో ప్రస్తుతం బిల్డింగ్ వృథాగా మారింది. బిల్డింగ్‌లో మంచినీటి సౌకర్యం, రోడ్డు పనులు, కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయలేదు. ఈ పనులు కంప్లీట్ చేసి షాపులను ఓపెన్ చేస్తే ఆదాయంతో పాటు ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఆరు కోట్లతో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్‌లో కూడా సమస్యలు తిష్ట వేశాయి. బస్టాండ్ లో రోడ్డు ఒకవైపు మాత్రమే వేయడంతో బస్సుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది.
మున్సిపాలిటీకి హ్యాండోవర్ చేయలే
రూ.13 కోట్ల50 లక్షలతో మార్కెట్ కమిటీ ప్లేస్‌లో స్పెషల్ ఫండ్స్ కింద నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ఇప్పటివరకు మున్సిపాలిటీకి అప్పగించలేదు. వాస్తవంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మున్సిపాలిటీకి హ్యాండోవర్ చేస్తారు. కానీ గద్వాల ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను మాత్రం ఇప్పటివరకు వారికి హ్యాండోవర్ చేయలేదు. గతేడాది అక్టోబర్ నెలలో ఓపెన్ అయినా ఇప్పటివరకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆర్డర్స్ రాలేదు.
ఆర్డర్స్ రావాల్సి ఉంది
స్పెషల్ ఫండ్స్ తో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆర్డర్స్ రావాల్సి ఉంది. ఈ విషయంపై జిల్లా ఆఫీసర్లకు సమాచారం ఇచ్చాం. మున్సిపల్ ఆఫీసర్లతో సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే మున్సిపాలిటీకి అప్పగిస్తాం.
పుష్ప, జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్