గాంధీ ఆస్పత్రిలో నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్లు

గాంధీ ఆస్పత్రిలో నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్లు
  • కరోనా సమయంలో ఎమర్జెన్సీ పేషెంట్ల కోసం ఏర్పాటు
  • సీఎస్ఆర్​ కింద అందించిన వివిధ కంపెనీలు
  • కొవిడ్​ కేసులు తగ్గడంతో నిరుపయోగంగా ట్యాంకులు
  •  8 ప్లాంట్లలో ఒకటి తొలగింపు

పద్మారావునగర్, వెలుగు: కొవిడ్​సమయంలో గాంధీ ఆస్పత్రికి పలు కార్పొరేట్​కంపెనీలు అందజేసిన ఆక్సిజన్​ప్లాంట్లు భారంగా మారాయి. కరోనా వచ్చి వెంటి లేటర్లపై ఉండే పేషెంట్లకు ఎమర్జెన్సీగా ఆక్సిజన్​ అందించేందుకు సీఎస్​ఆర్( కార్పొరేట్​సోషల్ రెస్సాన్సిబిలిటీ) కింద కంపెనీలు ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం కొవిడ్​కేసులు అంతగా లేకపోవడంతో ఆక్సిజన్​వాడకం తగ్గింది.  ప్లాంట్ల నుంచి ఉత్పత్తి  లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. మొత్తం 8 ఆక్సిజన్​ ప్లాంట్లు ఉండగా వీటికి కరెంటు బిల్లుల భారం పడుతుంది.  మరోవైపు ఆస్పత్రి ఆవరణలోని జాగా ఉపయోగంలో లేకుండా ఉంది. 

ప్రస్తుతం అవసరం లేకపోగా..

ఒకటి, రెండో వేవ్​ల్లో కరోనాతో జనాలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. థర్డ్​వేవ్​లో అంతగా ప్రభావం చూపకపోగా గాంధీలోని ఆక్సిజన్​ ప్లాంట్ల అవసరం లేకుండా పోయింది. కొన్ని యూనిట్లలోని సామగ్రి తుప్పు పట్టే స్థితికి చేరింది. ఎస్​ఎమ్​ఎస్​ లైఫ్​ సైన్సెస్​ కంపెనీ తన ప్లాంట్​ను తొలగించి, అందులోని పరికరాలను  తీసు
కెళ్లింది. మిగతా కార్పొరేట్​ కంపెనీలు కూడా తమ ప్లాంట్లను తొలగిస్తే విద్యుత్​బిల్లుల భారం, స్థలం వాడుకలోకి వస్తుందని ఆస్పత్రికి వచ్చే పలువురు పేర్కొంటున్నారు. 

ప్లాంట్ల నుంచి వచ్చే ఆక్సిజన్​నేరుగా..

ప్రెజర్ స్వింగ్ అడ్సార్ప్షన్ (పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ) టెక్నాలజీతో పనిచేసే ప్లాంట్లను రెగ్యులర్​గా ఆన్​చేసి ఉంచితే  93 శాతం స్వచ్ఛతతో ఉత్పత్తయ్యే ఆక్సిజన్​వెంటిలేటర్లపై ఉండే పేషంట్లకు పనికిరాదు. వాటిని ఆపకుండా నడిపిస్తే విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవుతాయి. సౌండ్​పొల్యూషన్​ఉందంటూ ఆస్పత్రి చుట్టపక్కల నివసించే వారి నుంచి కంప్లయింట్​కూడా వస్తున్నాయి. మరోవైపు ఎక్కువ సంఖ్యలో ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో గాంధీలో జాగా తగ్గిపోయి మిగతా వసతులు, సౌకర్యాలు కల్పించడానికి ఇబ్బందులు వస్తున్నాయి.  ప్లాంట్ల నుంచి వచ్చే ఆక్సిజన్​నేరుగా పేషంట్లకు ఇచ్చేందుకు పనికి రాదు. ఇప్పటికే అందుబాటులో ఉన్న రెగ్యులర్​20 ప్లస్​6  వేల కిలోలీటర్ల  రెండు లిక్విడ్​ఆక్సిజన్​ట్యాంకులతో పాటు అదనంగా ఇటీవల మరో 20 వేల కిలో లీటర్ల ట్యాంకు కూడా మంజూరైంది. ఈ రెండు ఆక్సిజన్​ ట్యాంకులు ఆస్పత్రిలోని వైద్య అవసరాలకు  సరిపోతాయని మెడికల్ ఆఫీసర్లు చెబుతున్నారు.