- నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు!
- చాలా చోట్ల స్కూళ్లలోనే ఏర్పాటు
- వసతులు, పరికరాలు లేక కన్నెత్తిచూడని క్రీడాకారులు
- ఆదిలాబాద్జిల్లాలో కోట్లాది రూపాయలు వృథా
ఇక్కడ క్రీడా ప్రాంగణం అని బోర్డు పెట్టినా నిజానికది ఓ స్కూల్ప్లే గ్రౌండ్. ఆదిలాబాద్ మండలం జందాపూర్ లో ఎకరా స్థలంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుచేసినట్లు కాగితాల్లో కనిపిస్తోంది. తీరా చూస్తే స్కూల్గ్రౌండ్ నే క్రీడా ప్రాంగణంగా చూపి లక్షలు దండుకున్నారు. పోనీ క్రీడా పరికరాలు ఏమైనా అందుబాటులో ఉంచారా? అంటే అదీ లేదు. పచ్చదనం కోసం మొక్కలు కూడా నాటలేదు. గ్రౌండ్ మధ్యలో నాలుగైదు పోల్స్వేసి వదిలేశారు. జిల్లావ్యాప్తంగా స్కూళ్లు, ఆఫీసుల ముందు ఏర్పాటుచేసిన ఇలాంటి క్రీడా ప్రాంగణాలతో లక్షలు వృథా అయ్యాయి తప్పితే ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది.
వెలుగు, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో రూ.4లక్షల చొప్పున ఖర్చు చేసి 780 హ్యాబిటేషన్లలో ఏర్పాటుచేసిన క్రీడాప్రాంగణాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ప్రభుత్వం ఓ వైపు వందల ఎకరాల సర్కారు భూములను ప్లాట్లు చేసి అమ్ముకుంటోంది. కానీ ఆఫీసర్లు మాత్రం క్రీడాప్రాంగణాలకు స్థలాలు దొరకడం లేదనే సాకుతో చాలా చోట్ల స్కూల్ గ్రౌండ్లనే ప్లే గ్రౌండ్లుగా ఎంపిక చేశారు. వాటినే డెవలప్చేసినట్లు చూపి కేంద్రం ఇచ్చే ఉపాధి నిధులను స్వాహా చేశారు.
వసతుల్లేవ్.. పరికరాల్లేవ్..
ఒక ఎకరా స్థలంలో క్రీడాప్రాంగణాన్ని ఏర్పాటుచేసేందుకు రూ.4 లక్షల ఈజీఎస్ఫండ్స్వాడుకునేలా సర్కారు అవకాశమిచ్చింది. ఎకరా స్థలం దొరకనప్పుడు అర ఎకరాలో ఏర్పాటుచేసుకోవచ్చని సూచించింది. కానీ చాలా చోట్ల స్కూళ్లు, ఆఫీసుల ప్రాంగణాల్లో ఏర్పాటుచేసిన ప్లే గ్రౌండ్స్ అర ఎకరం కంటే తక్కువ విస్తీర్ణం ఉన్నాయి. ఆయా చోట్ల చదును పేరుతో బ్లేడ్ట్రాక్టర్తో నాలుగుసార్లు అటూ ఇటూ తిప్పి, పెద్దపెద్ద బోర్డులు మాత్రం తగిలించారు. కానీ ఏ క్రీడా ప్రాంగణంలోనూ అవసరమైన వసతులు కల్పించలేదు. ఖోఖో, కబడ్డీ, వాలీ బాల్, లాంగ్ జంప్ కోర్టులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు. కొన్ని చోట్ల లాంగ్ బార్, సింగిల్, డబుల్ స్తంభాలు ఏర్పాటు చేయలేదు. ఇప్పటివరకు తమకు ఎలాంటి కిట్లు అందలేదని క్రీడాకారులు అంటున్నారు. ఇక క్రీడా ప్రాంగణాల చుట్టూ వేప, గుల్మార్, కానుగ, చింతతో పాటు పలురకాల నీడనిచ్చే మొక్కలు నాటాల్సిఉండగా ఎక్కడా నాటలేదు. కొన్ని చోట్ల నాటినా సంరక్షణ లేక ఎండిపోయాయి. కొన్నింటిని పశువులు మేయడంతో గ్రౌండ్లన్నీ కళా విహీనమయ్యాయి. ఏ ఒక్క క్రీడాకారుడుగానీ అటువైపు కన్నెత్తిచూడని పరిస్థితి ఉంది. సర్కారు అనాలోచిత నిర్ణయం, ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే జిల్లాలో క్రీడాప్రాంగణాల పేరిట కోట్ల రూపాయలు వృథా అయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పూర్తిస్థాయిలో డెవలప్చేస్తాం
క్రీడా ప్రాంగణాలను పూర్తిస్థాయిలో డెవలప్చేస్తాం. కొని చోట్ల అన్నివసతులు కల్పించాం. మిగిలిన చోట్ల త్వరలోనే క్రీడాకారులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతాం.ప్రతి ఒక్కరూ ప్లే గ్రౌండ్స్‌ను సద్వినియోగం చేసుకోవాలి.
–కిషన్, డీఆర్డీవో