శివ్వంపేట, వెలుగు: తమ గ్రామంలో కెమికల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దని మెదక్జిల్లా శివ్వంపేట మండలంలోని ఉసిరికపల్లి గ్రామస్తులు తీర్మానం చేశారు. అధికారుల ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని మంగళవారం వారు అడ్డుకోగా... బుధవారం గ్రామస్తులంతా మళ్లీ సమావేశమయ్యారు. కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి పంచాయతీ కార్యదర్శికి అందజేశారు. తమ గ్రామంలో కంపెనీ ఏర్పాటు చేయొద్దంటూ నెల రోజుల నుంచి ఆందోళన చేస్తున్నామన్నారు. కలెక్టర్, పీసీబీ అధికారులకు ఫిర్యాదులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
మరోవైపు, కంపెనీ యాజమాన్యం ప్రతినిధి ప్రకాశ్ గ్రామస్తులతో బుధవారం మాట్లాడారు. తాము ఏర్పాటు చేసే కంపెనీతో ఎలాంటి నష్టాలు ఉండవని, అనేక మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. తమకు ఉపాధి లేకపోయినా ఫర్వాలేదని కంపెనీ మాత్రం వద్దని గ్రామస్తులు తేల్చిచెప్పారు. నిర్మాణ పనులు వెంటనే ఆపివేయాలనీ, లేకపోతే నిరాహార దీక్ష చేస్తామన్నారు. కంపెనీ యజమాన్యం గ్రామస్తుల్లో కొంతమందికి ఫొన్లు చేసి బెదిరిస్తున్నారనీ, కంపెనీ సూపర్వైజర్ గ్రామస్తులు గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయమై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.