ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సిరీస్ కు ముందు డేవిడ్ వార్నర్ పై మిచెల్ జాన్సన్ వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ తర్వాత వార్నర్ టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించనుడడంతో ఈ స్టార్ బ్యాటర్ కు గ్రాండ్ గా గుడ్ బై చెప్పాలని భావిస్తుంది. దీంతో జాన్సన్ వార్నర్ ను దారుణంగా అవమానించాడు. సొంత దేశానికి చెందిన ప్లేయర్ ను ఇలా విమర్శించడంతో అందరూ షాకయ్యారు.
టెస్టు క్రికెట్‌లో వార్నర్ దారుణంగా విఫలమవుతున్నాడని.. అతని రిటైర్మెంట్ తేదీని నామినేట్ చేసే అవకాశం ఎందుకిచ్చారని బోర్డు పై ఫైర్ అయ్యాడు. అంతటితో ఆగకుండా ఆస్ట్రేలియన్ క్రికెట్ చరిత్రలో వార్నర్ బాల్ టాంపరింగ్ కేసులో శిక్ష అనుభవించాడని.. ఇలాంటి ఆటగాడిని ఘనంగా వీడ్కోలు పలకడానికి మీరు ఎందుకు సిద్దమవుతున్నారంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై జాన్సన్ మండిపడ్డాడు. కొంతమందికి వార్నర్ ను కావాలని తప్పు పట్టడం నచ్చలేదు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వార్నర్ కు మద్దతుగా నిలిచాడు
"వార్నర్, స్మిత్ లు ఆస్ట్రేలియా క్రికెట్ కు ఎన్నో సేవలు చేశారు. బాల్ టాంపరింగ్ ఉదంతంలో 12 నెలల శిక్ష అనుభవించారు. వీరిద్దరూ నా క్రికెట్ హీరోలు. ఒకరిని మరొకరు విమర్శించే అర్హత ఎవరికీ లేదు. జాన్సన్ పర్ఫెక్ట్ కాదు. నేను, స్మిత్, వార్నర్ పర్ఫెక్ట్ కాదు. వారు దేశానికి చేసిన దానిని గుర్తించాలి గాని విమర్శించడం సరైన పద్ధతి కాదు". అని ఖవాజా సోమవారం విలేకరులతో అన్నారు.
భారత్ తో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా పాక్ తో టెస్టు సిరీస్ కు సిద్ధమవుతుంది. స్వదేశంలో పాకిస్థాన్ తో మూడు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ జనవరి 7 న ముగుస్తుంది. ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించి పాక్ జట్టును ప్రకటించగా.. శనివారం(డిసెంబర్ 2) 14 మందితో కూడిన ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. వరల్డ్ కప్ తర్వాత పాక్ ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడం గమనార్హం.