AUS vs WI: బౌన్సర్ దెబ్బకు గ్రౌండ్‌లోనే రక్తం: ఆసీస్ స్టార్ బ్యాటర్‌కు తీవ్ర గాయం

AUS vs WI: బౌన్సర్ దెబ్బకు గ్రౌండ్‌లోనే రక్తం: ఆసీస్ స్టార్ బ్యాటర్‌కు తీవ్ర గాయం

క్రికెట్ లో బౌన్సర్ లు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంటకు 140కు పైగా వేగంతో వేసే ఈ బౌన్సర్లు నుంచి తప్పించుకోవడానికి హెల్మెట్ ను రక్షణగా ఉంచుకుంటారు. అయినా కొన్ని సందర్భాల్లో ఈ బౌన్సర్ ధాటికి బ్యాటర్లు తప్పించుకోలేక గాయాలపాలవుతారు. ఆసీస్ లాంటి బౌన్సీ పిచ్ లపై వికెట్ కోసం బౌన్సర్ లను అస్త్రంగా వాడుకుంటాడు. ఈ క్రమంలో ఆటగాళ్లు గాయాలవ్వడం సహజం. తాజాగా ఆసీస్ స్టార్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా బౌన్సర్ తో తీవ్ర గాయాలపాలయ్యాడు.
 
ప్రస్తుతం వెస్టిండీస్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో నేడు (జనవరి 19)ఆస్ట్రేలియా ఓపెనర్ ఖవాజా ప్రమాదకర బౌన్సర్ నుంచి బయటపడ్డాడు. 26 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ విజయానికి ఒక్క పరుగు కావాల్సిన దశలో షమరీ జోసెఫ్ వేసిన ఒక బౌన్సర్ ఖవాజా హెల్మెట్ గ్రిల్ బలంగా తాకింది. ఖవాజా గడ్డం దగ్గర ఈ బంతి తగలడంతో అసౌకర్యంగా కనిపించాడు. బంతి దవడకు గట్టిగా తగలడంతో నోటిలో నుంచి ఉమ్మి వేయగా రక్తం వచ్చింది. దీంతో వైద్య సిబ్బంది వచ్చి ఖవాజాను తీసుకెళ్లారు. 

ఖవాజా ఎలాంటి ప్రమాదం లేదని.. అతని పరిస్థితి బాగానే ఉందని ESPNcricinfo తో కమ్మిన్స్ చెప్పాడు. జనవరి 25 నుంచి  బ్రిస్బేన్  వేదికగా గబ్బా వేదికగా జరగనున్న రెండో టెస్టుకు ఖావాజా దూరమైతే అతని స్థానంలో రెంషా ఇన్నింగ్స్ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా విండీస్ పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 188 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆసీస్ 283 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 120 పరుగులకు ఆలౌట్ కాగా.. 26 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ వికెట్లేమీ కోల్పోకుండా ఛేజ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ ట్రావిస్ హెడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో ఆసీస్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ లోకి దూసుకెళ్లింది.