- ఎప్టీఎల్కు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్
- ఎగువ నుంచి భారీగా వరద
- ఎప్పుడైనా గేట్లు తెరిచే అవకాశం
- సురక్షిత ప్రాంతాలకు మూసీ ప్రజల తరలింపు
- హుస్సేన్ సాగర్ కూడా ఫుల్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు భారీ ఎత్తున వరద వస్తోంది. చేవెళ్ల, మొయినాబాద్, జన్వాడ, అజీజ్‌నగర్, కొత్వాల్‌గూడ, శంకర్పల్లి, నాగర్‌గూడ, పొద్దుటూరు వాగు, షాబాద్ మండలంలోని ఈసీ వాగు, ఆలూరు పెద్దవాగు, కమ్మెటవాగు, మంచిరేవుల తదితర ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అలాగే పరీవాహక ప్రాంతాల్లోని వాగులు, కాలువల ద్వారా కూడా భారీగా నీరు వస్తున్నది. రెండు జలాశయాలు ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్టీఎల్) కు చేరువ కావడంతో గేట్లు ఎత్తడానికి వాటర్ బోర్డు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఉస్మాన్సాగర్పూర్తి స్థాయి నీటిమట్టం 1,790 అడుగులు (3.9 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1,782 అడుగులకు చేరుకుంది. హిమాయత్‌సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1,763 అడుగులు (2.9 టీఎంసీలు) కాగా .. 1,756 అడుగులకు చేరింది. వరద ఇలాగే కొనసాగి జలాశయాలు ఎఫ్ టీఎల్ కు చేరుకుంటే ఎప్పుడైనా గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జంట జలాశయాలు నిండడంతో మెట్రోవాటర్ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి పరిశీలించారు. ఉస్మాన్‌సాగర్‌కు 15 గేట్లు ఉండగా, హిమాయత్‌సాగర్‌కు 17 గేట్లు ఉన్నాయి. వరద పెరిగితే గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని వదిలే అవకాశం ఉంది. దీంతో మూసీ పరీవాహక ప్రాంతాలు, బస్తీలు మునిగిపోయే ప్రమాదం ఉండడంతో ఆయన ప్రాజెక్టులను సందర్శించారు. మూసీ పరిసరాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
హుస్సేన్ సాగర్ ఫుల్..
భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ కు వరద తీవ్రత పెరిగి నిండుకుండలా మారింది. భారీగా వరదనీరు చేరుతుండడంతో నీటిని ఎప్పటికప్పుడు అధికారులు బటయకు పంపుతున్నారు. సాగర్ లోకి వస్తున్న వరద పరిస్థితిని జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం అధికారులు 24 గంటల పాటు పరిశీలిస్తున్నారు. సాగర్ ఎఫ్ టీఎల్ 513.41 మీటర్లు కాగా.. ఆదివారం సాయంత్రానికి నీటిమట్టం 513.70 మీటర్లకు చేరింది. ప్రస్తుతం 10,270 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా, 9622 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అవసరమైతే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్పారు.